Esha Deol: పొట్టి దుస్తులు వేసుకోవద్దన్నాడు..మాజీ భర్తపై ఇషా ఆరోపణలు
Esha Deol: ప్రముఖ బాలీవుడ్ నటి, హేమమాలిని ధర్మేంద్రల గారాలపట్టి ఇషా డియోల్ విడాకులు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. 12 ఏళ్ల క్రితం ముంబైకి చెందిన వ్యాపారవేత్త భరత్ తఖ్తానీని (Bharat Takhtani) వివాహం చేసుకున్న ఇషా అతనితో ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చారు. కొన్ని రోజులుగా వీరి మధ్య విభేదాలు ఉన్నాయని.. విడిపోతున్నారని టాక్ వినిపించింది. ఆ తర్వాత నిజంగానే తాము విడిపోయినట్లు ప్రకటించారు.
అయితే తాము ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో ఇషా తాను రాసిన అమ్మా మియా అనే పుస్తకంలో వివరించారు. రెండో పాప పుట్టాక భరత్‌లో అభద్రతా భావం ఎక్కువైందని.. అసలు తనను ఎవరూ పట్టించుకోవడంలేదు అనుకున్నాడని ఇషా పేర్కొన్నారు. కాస్త తప్పు తనది కూడా ఉన్నప్పటికీ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారి ఆలనా పాలనా చూసుకోవద్దా అంటూ తనని తాను సమర్ధించుకున్నారు. అంతేకాదు.. ఇంట్లో ఇషా షార్ట్స్ వేసుకుంటే అందుకు భరత్ అడ్డు చెప్పేవాడట. ఇందుకు కారణం తనది జాయింట్ ఫ్యామిలీ కావడమే. దాంతో అడ్జస్ట్ అవ్వడానికి ఇషాకు చాలానే సమయం పట్టిందట.
“” నా రెండో కూతురు పుట్టాక భరత్‌లో చాలా మార్పులు గమనించాను. భరత్ ఏదీ నోరు విప్పి చెప్పడు. తన ప్రవర్తనతోనే అన్నీ అర్థమైపోతాయి. రెండో కూతురు పుట్టాక నేను నా పెద్ద కూతురు స్కూలింగ్.. నా పుస్తకం రాయడం.. ఇతర ప్రొడక్షన్ పనులతో బిజీ అయిపోయాను. కనీసం భరత్‌తో ఒక గంట పాటు మాట్లాడే సమయం కూడా ఉండేది కాదు. ఓసారి భరత్ నన్ను కొత్త టూత్ బ్రష్ కావాలి అని అడిగినప్పుడు నేను తనకు సమయం కేటాయించడంలేదని.. తన గురించి బొత్తిగా పట్టించుకోవడంలేదని అర్థమైపోయింది. (esha deol divorce)
భరత్ లంచ్‌కి ఏం తీసుకెళ్తున్నాడు? ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకుంటున్నాడా లేదా వంటి అంశాలను పట్టించుకోవడం మానేసా. ఇదొక్కటే కాదు. నేను తనతో డిన్నర్‌కి కానీ డేట్ నైట్‌కి కానీ వెళ్లడం కుదిరేది కాదు. ఒకవేళ వెళ్లాలనుకున్నా నీట్‌గా మంచి దుస్తులు వేసుకుని కాకుండా ఏదో పైజామా వేసుకుని జుట్టు విరబూసుకుని వెళ్లిపోతుండేదాన్ని. అది భరత్‌కు మింగుడుపడలేదు. నేను తనకు సరైన సమయం కేటాయించలేకపోతున్నానన్న విషయం భరత్ జీర్ణించుకోలేకపోయాడు. కానీ నేను మాత్రం ఏం చేయగలను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వారిని నేను దగ్గరుండి చూసుకోవాలి “” అని తన పుస్తకంలో రాసుకొచ్చారు ఇషా.
అయితే విడాకుల తర్వాత కూడా ఇషా తన సోషల్ మీడియా నుంచి మాజీ భర్తతో కలిసి దిగిన అపురూపమైన ఫోటోలను మాత్రం డిలీట్ చేయలేదు. వాటిని డిలీట్ చేసేంత కోపం కక్ష ఒకరిపై ఒకరికి లేవని తెలిపారు. అయితే ఇప్పుడు ఇషా డియోల్ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించాలనుకుంటున్నారట. ఇందుకు తన తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. తమిళంలో వచ్చిన యువ సినిమాలో ఇషా డియోల్ నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ ఇషాను అందరూ ధూమ్ గర్ల్గానే గుర్తుపెట్టుకున్నారు. ధూమ్ సిరీస్‌లో వచ్చిన తొలి సినిమాలో ఇషా హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత ఇషా సినీ కెరీర్ ఏమీ పెద్దగా ఊపందుకోలేదు.