Drishyam: RRR ఎఫెక్ట్.. మ‌న సినిమాకి హాలీవుడ్ రీమేక్..!

Drishyam: ఇంత‌కాలం హాలీవుడ్ (Hollywood) సినిమాల‌ను ఇండియాలో తెగ రీమేక్‌లు చేసేవారు. చేసేవారు ఏంటి.. ఇప్ప‌టికీ చేస్తున్నారు. అలాంటిది చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే తొలిసారి మ‌న సినిమా హాలీవుడ్ రీమేక్‌కు నోచుకోబోతోంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ (Mohanlal), మీనా (Meena) న‌టించిన దృశ్యం (Drishyam) సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించిందో తెలిసిందే. జీతూ జోసెఫ్ ఎక్క‌డి నుంచి ఈ క‌థ‌ను ప‌ట్టుకొచ్చారో ఆయ‌న మెద‌డులో ఇలాంటి ఒక ఒళ్లు గ‌గుర్పొడిచే క‌థ ఎందుకు తీయాల‌నిపించిందో కానీ.. దృశ్యం ఫ్రాంచైస్‌కి అంద‌రూ ఫ్యాన్స్ అయిపోయారు. ఇదే సినిమాను తెలుగులో వెంక‌టేష్‌, మీనాలు క‌లిసి న‌టించారు.

తెలుగులోనూ ఈ సినిమాకు వ‌చ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఎక్క‌డా కూడా బోర్ కొట్ట‌కుండా కుర్చీల‌కు అతుక్కుపోయే రేంజ్‌లో సినిమాను తీసారు. ఇక మ‌ల‌యాళం, తెలుగులో ఇంత రెస్పాన్స్ వ‌చ్చిన‌ప్పుడు హిందీలోనూ తీస్తే బాగుంటుంది క‌దా అని అనుకున్నారు. అలా నిశికాంత్ కామ‌త్ ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేసి హిందీలో ఆయ‌న డైరెక్ట్ చేసారు. హిందీలో అజ‌య్ దేవ‌గ‌ణ్, శ్రియ జంట‌గా న‌టించారు. ఇప్ప‌టికి దృశ్యం 2 వ‌ర‌కు రిలీజ్ అయ్యాయి. త్వ‌ర‌లో దృశ్యం 3 కూడా రాబోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ వెల్ల‌డించారు.

ఈ సినిమా యావ‌త్ భార‌తదేశానికే కాదు.. హాలీవుడ్ వారికి కూడా న‌చ్చింది. అందుకే ఈసారి మ‌న క‌థ‌ను వారు రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దృశ్యం సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు భార‌త్‌కు చెందిన ప‌నోర‌మ ఫిలింస్, హాలీవుడ్‌కి చెందిన గ‌ల్ఫ్ స్ట్రీమ్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు ముందుకొచ్చాయి. ఒక‌రకంగా చెప్పాలంటే మ‌న ద‌క్షిణాది సినిమా హాలీవుడ్‌లో రీమేక్ అవ్వ‌డానికి RRR సినిమా కూడా ఒక కార‌ణ‌మే. RRR సినిమాతో ద‌ర్శ‌క ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి (SS Rajamouli) మ‌న ద‌క్షిణాది సినిమాను ఎక్క‌డికో తీసుకెళ్లిపోయారు. ఆస్కార్ అవార్డు కూడా ద‌క్కింది. దాంతో RRR పుణ్య‌మా అని మ‌న స‌త్తా ఇప్ప‌టికైనా హాలీవుడ్ వారికి తెలిసింది. అందుకే ఇక నుంచి మ‌నం వారి సినిమాల‌ను కాదు.. వారే మ‌న సినిమాల‌ను రీమేక్ చేసే స‌మ‌యం వ‌చ్చింది.

మ‌రో ప‌ది దేశాల్లో..!

ఇప్ప‌టికే దృశ్యం సినిమాను ద‌క్షిణ కొరియా, చైనాలో డ‌బ్ చేసి రిలీజ్ చేసారు. అక్క‌డ కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు హాలీవుడ్‌లో ఏకంగా రీమేక్ కాబోతోంది. దృశ్యం సినిమాను మొత్తం ప‌ది దేశాల్లో రీమేక్ చేయబోతున్నార‌ట‌. ప‌ది దేశాల్లో ఈ సినిమాను రీమేక్ చేయ‌డానికి మ‌రో మూడు నుంచి ఐదేళ్లు ప‌డుతుంద‌ని చిత్ర‌బృందం తెలిపింది. చైనీస్ భాష‌లో ఈ సినిమాను ఎ షెపర్డ్ వితౌట్ షీప్ అనే పేరుతో రీమేక్ చేసారు. అక్క‌డ ఈ సినిమా 100 మిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్ల‌ను రాబట్టింది. ఇక దృశ్యం 3 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని దృశ్యం ఫ్యాన్స్ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఫ‌స్ట్ పార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయితే దాని సీక్వెల్ డ‌బుల్ హిట్ అవ్వ‌డం అనేది చాలా అరుదుగా జ‌రుగుతుంది. అది బాహుబలి త‌ర్వాత దృశ్యంకే సాధ్య‌ప‌డింది. ఇక దృశ్యం 3 కూడా అదే రేంజ్‌లో ఉంటుంద‌ని భావిస్తున్నారు.