అన్నయ్యా.. అంటూ పవన్‌కు సముద్రఖని లెటర్
Hyderabad: విలక్షణ నటుడు, డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani) బర్త్‌డే సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విషెస్ తెలుపుతూ బుధవారం ఓ లెటర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖను, పవన్ కల్యాణ్ తెలిపిన శుభాకాంక్షలను (Birthday Greetings) చూసి సముద్రఖని ఎంతో సంతోషించారు. ఆ విషయాన్ని తెలుపుతూ.. తను కూడా ట్విట్టర్లో ఓ లెటర్ రిలీజ్ చేశారు. అన్నయ్యా.. అంటూ ఎంతో ఆప్యాయంగా సముద్రఖని రాసిన ఈ లేఖను మెగా ఫ్యాన్స్ (Mega Fans) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మీ మనసులోంచి వచ్చిన ఈ మాటలు నిజమవ్వాలని మేమూ కోరుకుంటున్నామనేలా కామెంట్స్ చేస్తున్నారు.
‘‘అన్నయ్యా, నా పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మీతో నటుడిగా దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలను నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగేందుకు కావలసిన ధైర్యాన్ని, చైతన్యాన్ని నాలో నింపింది. ముఖ్యంగా సమాజం పట్ల మీకున్న ప్రేమ, అక్కర నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానినయ్యేలా చేసింది. సదా మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు దృక్పథానికి సహచరుడినై ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగనే మార్పు సాకారమై, తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు మిమ్మిల్ని నడిపించాలని మీకు శక్తి ప్రసాదించాలని ప్రార్ధిస్తాను’’ అని సముద్రఖని తన లేఖలో తెలిపారు.