పరాయివాడే.. నాగబాబు ట్వీట్ బన్నీ గురించేనా?
Nagababu: రెండు రోజుల క్రితం నాగబాబు చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారి తీసింది. మెగా కుటుంబంలో చాలా మంది హీరోలు ఉన్నారు. అల్లు అర్జున్‌ని కూడా మెగా హీరోగానే భావిస్తారు. చాలా మంది అల్లు కుటుంబానికి కొణిదెల కుటుంబానికి మధ్య గొడవలు ఉన్నాయని అనుకుంటారు. కానీ వాళ్ల కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయో ఎవ్వరికీ తెలీదు. బయటికి మాత్రం అంతా ఒక్కటే అన్నట్లుగా ఉంటారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ గెలవాలని తన ప్రేమ, మద్దతు ఎప్పుడూ పవన్‌కే ఉంటాయని అల్లు అర్జున్ ట్వీట్ చేయడంతో చాలా మంది సంతోషించారు. కానీ ఆ మరుసటి రోజే పవన్ కళ్యాణ్ కోసం ప్రచారంలో పాల్గొనకుండా అల్లు అర్జున్.. వైఎస్సార్ కాంగ్రెస్ నంద్యాల అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కోసం ప్రచారం చేయడం షాక్‌కు గురిచేసింది. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. తాను పార్టీలకు అతీతం అని.. తన వాళ్లు ఏ పార్టీలో ఉన్నా వారికి మద్దతు తెలుపుతానని అన్నారు.
ఎప్పుడైతే అల్లు అర్జున్ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధి తరఫున ప్రచారం చేసాడో ఆ మరుసటి రోజే నాగబాబు ఓ ట్వీట్ చేసారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…! అని ట్వీట్ చేసారు. దాంతో ఆయన అల్లు అర్జున్ గురించే ప్రస్తావించారని.. బన్నీ ఇంట్లో మనిషి కోసం కాకుండా ఎవరితో అయితే పవన్ పోరాడుతున్నారో ఆ పార్టీకి చెందిన నేతకే మద్దతు ఇవ్వడం పట్ల నాగబాబుతో పవన్ కళ్యాణ్ కూడా చాలా బాధపడ్డారని సన్నిహితులు అంటున్నారు.