Devara Event: సీఎం వల్లే ఆగిపోయిందా?
Devara Event: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అట్టహాసంగా జరగాల్సి ఉంది. హైదరాబాద్‌లోని నొవోటెల్‌లో ఈ వేడుకను ఏర్పాటుచేసారు. అయితే చివరి నిమిషంలో ఈవెంట్ రద్దయ్యింది. ఆ తర్వాత ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం పట్ల తాను కూడా చాలా బాధపడుతున్నానని.. అభిమానులకు ఎప్పుడూ తాను రుణపడి ఉంటానని తారక్ ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌ను కూల్ డౌన్ చేసే ప్రయత్నం చేసారు.
దేవర సినిమా నిర్మాణ సంస్థ శ్రేయస్ మీడియాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎక్కువ పాస్‌లు ప్రింట్ చేసేయడం, పోలీసులను ఎక్కువగా పెట్టించకపోవడం వల్లే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈవెంట్ ఆగిపోయింది అంటూ మండిపడ్డారు. దీనిపై శ్రేయస్ మీడియా కూడా స్పందించింది. తాము కేవలం 4000 పాసులే ప్రింట్ చేయించామని.. కానీ 30 వేల మంది పాసులు లేకుండా వచ్చేసారని అన్నారు. తమకు తెలంగాణ ప్రభుత్వం 4000 మందికి మాత్రమే పోలీసులను సెక్యూరిటీగా ఇచ్చిందని.. కానీ ఇలా జరుగుతుందని తాము కూడా అనుకోలేదని అన్నారు.
అయితే చివరి నిమిషంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవర ఈవెంట్ జరగాల్సిన నొవోటెల్ నుంచి నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న ట్రైడెంట్లోని ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. దాంతో సెక్యూరిటీ బలగాలన్నీ అక్కడే ఉన్నాయి. దాదాపు 300 మంది పోలీసులు రేవంత్ సెక్యూరిటీలో భాగంగా ఉన్నారు. ఇలాంటి ఏదన్నా పెద్ద ఈవెంట్ జరిగే సమయంలో సీఎం కార్యక్రమాలు ఉంటే అసలు ఈవెంట్లకు పర్మిషన్లు కూడా ఇవ్వరు. కానీ చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి ట్రైడెంట్ హోటల్‌కి రావడంతో దేవర ఈవెంట్ దగ్గర ఉండాల్సిన పోలీసుల్లో సగం మంది సీఎం వద్దకు వెళ్లిపోయారు. సీఎం కార్యక్రమం రాత్రి 7:30 గంటలకు ముగిసింది. ఆ తర్వాత పోలీసులు నొవోటెల్కు 8:30 గంటల సమయంలో వచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
శ్రేయస్ మీడియాకు, ఎన్టీఆర్‌కు ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ సమయంలో కూడా తారక్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. కానీ అదే సమయంలో నిమజ్జనాలు ఉన్నాయన్న కారణంతో చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ను క్యాన్సిల్ చేసారు.