Dhamaka: 100 మిలియన్​ వ్యూస్​తో దూసుకెళ్తున్న‌ ‘పల్సర్​ బైక్’​!

Hyderabad: గతేడాది డిసెంబర్‌ విడుదలైన ధమాకా(Dhamaka) బాక్సాఫీస్‌ దగ్గర సెస్సేషన్​ క్రియేట్​ చేసి మాస్​మహారాజ రవితేజ(Raviteja) కెరీర్​లో సూపర్​ హిట్​గా నిలిచింది. ఏకంగా వందకోట్లు రాబట్టి రవితేజ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్‌లు రాబట్టిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాతోనే కన్నడ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాగా పాపులర్​ అయింది. ఈ సినిమాలో శ్రీలీల అందాలకు, డ్యాన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రవితేజ ఎనర్జిటిక్‌ పర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్‌ సంగీత దర్శకుడు భీమ్స్‌కే ఇవ్వాలి. ఈ సినిమా పాటలు ఒకదానికి మించి మరొకటి చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది. మొత్తం ఆల్భమ్​ రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాలో పల్సర్‌ బైక్‌(Pulsar Bike) సాంగ్‌కు థియేటర్‌లో అభిమానులు చేసిన గోల అంతా ఇంతా కాదు. ఆల్రెడీ విన్న పాటే అయినప్పటికి భీమ్స్‌ తన స్టైల్‌ ఆఫ్‌ మిక్సింగ్‌, సౌండ్‌ డిజైన్‌తో ఓ రేంజ్‌లో మ్యూజిక్‌ ఇచ్చాడు. దానికి ఏ మాత్రం తగ్గకుండా రవితేజ, శ్రీలీల డ్యాన్స్‌లు ఇరగదీశారు. నాలుగు నెలలుగా ఈ పాట యూట్యూబ్​లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది.

తాజాగా ఈ పాట 100మిలియన్ల వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంటే నాలుగు నెలల్లో ఈ పాటను పది కోట్ల మంది వీక్షించారు. ఇక ఇదే సినిమాలోని జింతాక్‌ సాంగ్‌కు వంద కోట్ల మిలియన్‌ల వ్యూస్‌ వచ్చాయి.