Chiranjeevi: పద్మ విభూషణ్ పట్ల అంత సంతోషమేమీ లేదు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ (padma vibhushan) ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చిరంజీవికి ఘనంగా సన్మానం చేసింది. ఈ సందర్భంగా చిరు ప్రసంగిస్తూ ఒక మాట అన్నారు. తనకు పద్మ విభూషణ్ ప్రకటించారు అని తెలిసినప్పుడు ఇంట్లో వాళ్లు ఎలా అనిపిస్తోంది అని అడిగారని.. బాగానే అనిపిస్తోందని మాత్రమే చెప్పానని అన్నారు. నిజానికి తనకు పద్మ భూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఆనంద పడ్డానని తెలిపారు. పద్మ భూషణ్ వచ్చిన చాలా ఏళ్ల తర్వాత తనకు పద్మ విభూషణ్ వచ్చిందని అందుకే తనకు అంత ఎగ్జైట్‌మెంట్ లేదని తెలిపారు. కానీ తనను గౌరవించి ఈ అవార్డును ప్రకటించారు కాబట్టి దానిని గౌరవిస్తూ స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు.
మీ ప్రేమతోనే కడుపు నిండిపోయింది
తనకు ఎన్ని అవార్డులు వచ్చినా ప్రేక్షకులు, ఫ్యాన్స్ వల్ల వచ్చినవే అని వారు లేకపోతే తాను లేనని కాస్త ఎమోషనల్ అయ్యారు చిరంజీవి. అవార్డు వచ్చినందుకు తనకంటే తన అభిమానులే ఎక్కువ సంతోషపడుతుంటే తన కడుపు నిండిపోయిందని అన్నారు.
రాజకీయాలు దిగజారిపోయాయి
ఈ సందర్భంగా చిరంజీవి తనను తన కుటుంబాన్ని వ్యక్తిగతంగా ధూషించే పార్టీలపై సెటైర్ కూడా వేసారు. ఈరోజుల్లో రాజకీయాలు దిగజారిపోయాయని.. రాజకీయాలంటే హుందాతనం ఉండాలని తెలిపారు. అలా హుందాతనంతోనే తాము చాలా సాధించామని.. ఇలా హుందాతనంతో ఉంటే రాజకీయాలు బాగుంటాయని తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆ ధూషణలు, దుర్భాషలాడటాలు చూసి తట్టుకోలేక తాను ఇలాంటి పని చేయలేను అని రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నానని అన్నారు. ఏ రోజైతే రాజకీయాల్లో హుందాతనం వస్తుందో అప్పుడు మార్పు దానంతట అదే వస్తుందని అభిప్రాయపడ్డారు.