Chiranjeevi: మరోసారి పెద్దమనసు చాటుకున్న మెగాస్టార్!
Hyderabad: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాల్లోనే కాదు.. సామాజిక కార్యక్రమాలు చేస్తూ.. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నారు. ఒక పక్క అభిమానులకు అన్ని సహకరిస్తూనే ఉండే చిరు.. ఇండస్ట్రీలో ఎవరకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సహాయం చేస్తుంటారు.
తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు చిరంజీవి (Chiranjeevi). అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘బలగం’ (Balagam) మొగిలయ్యకు సహాయం చేశారు. ఇటీవల చిన్న సినిమాగా విడుదలై భారీ హిట్ సాధించిన బలగం సినిమాలో ‘నా తోడుగా నా తోడు ఉండి’ అనే పాటతో పాపులర్ అయ్యారు బుడగ జంగాల కళాకారుడు మొగిలయ్య. ఇటీవల ఆయనకు కిడ్నీ సమస్య వచ్చింది. దాంతో మొగిలయ్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్(NIMS) లో అడ్మిట్ అయ్యారు.
కిడ్నీ సమస్యకు చికిత్స చేయించుకుంటున్నారు. అదే సమయంలో మొగిలయ్య కంటి సమస్యతోనూ బాధపడుతున్నారు. మొగిలయ్య సమస్య తెలుసుకున్న చిరంజీవి (Chiranjeevi) ఆయనకు సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. బలగం (Balagam) దర్శకుడు వేణు టిల్లు (Venu Tillu)కి ఫోన్ చేసి మొగిలయ్య కంటి చూపు కోసం అయ్యే ఖర్చు తాను భరిస్తానని, కంటి చూపు వచ్చేందుకు ప్రయత్నిద్దామని భరోసా ఇచ్చారట. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మొగిలయ్య దంపతులు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొగిలయ్య చికిత్సకు అయ్యే ఖర్చులు తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు.