Chiranjeevi: చదువుకున్న కాలేజీకి 50 లక్షలిచ్చిన మెగాస్టార్!
Hyderabad: స్వయంకృషితో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్(Tollywood)లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). తెలుగుతోపాటు దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే దాతృత్వంలోనూ అందరి హృదయాలను దోచుకుంటున్నారు చిరు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను స్థాపించి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపారు. టాలీవుడ్ లో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే తన వంతు సహాయం చేస్తుంటారు. దేశంలో ఎక్కడ ఆపద ఎదురైనా తనవంతుగా విరాళం అందించే చిరు నేరుగా తను చేసే సేవా కార్యక్రమాల గురించి ఎక్కడా చెప్పకపోవడం ఆయనలోని మరో ప్రత్యేకత.
తాజాగా మరోసారి చిరు గొప్పతనం వెలుగులోకి వచ్చింది. మెగాస్టార్ తాను చదువుకున్న వైఎన్ కాలేజీ(YN college)కి ఎంపీగా ఉన్న సమయంలో రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశారట. కళాశాల అభివృద్ధి కోసం ఈ నిధులను కెటాయించారట. ఈ విషయాన్ని ఆ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సత్యనారాయణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా కాలేజీలో చేపడితే తాను సొంతగా ఆర్థిక సహాయం చేస్తానని కూడా చిరంజీవి ప్రామిస్ చేశారని ఆయన తెలిపారు. దీంతో చిరంజీవి గొప్ప మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు మెగా అభిమానులు.
సినీ పరిశ్రమ నుంచి దాసరి నారాయణ రావు(Dasari Narayana Rao), కృష్ణంరాజు, చిరంజీవి, డైరెక్టర్ దవళ సత్యం, గజల్ శ్రీనివాస్, పాటల రచయిత అనంత శ్రీరామ్ వైఎన్ కాలేజీలోనే చదువుకున్నారట. కాలేజీలో ఉన్న ఆడిటోరియంలో చిరంజీవి, దాసరి నారాయణరావు డ్రామాలు కూడా వేసేవారట. అంతేకాదు ఎంపీ నిధుల నుంచి దివంగత దర్శకులు దాసరి నారాయణరావు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా రూ.10 లక్షల చొప్పున ఇచ్చారని వెల్లడించారు.