Chinmayi: డీప్ ఫేక్ వీడియో.. నాడు సిమ్ర‌న్.. నేడు ర‌ష్మిక‌

Chinmayi Sripaada: ఇటీవ‌ల ర‌ష్మిక మంద‌న‌కు (rashmika mandanna) సంబంధించిన డీప్ ఫేక్ మార్ఫ్‌డ్ వీడియో సోష‌ల్ మీడియాల సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ నాయ‌కుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ ర‌ష్మిక‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే గ‌తంలో త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు సెల‌బ్రిటీ డీప్ ఫేక్ వీడియోలో మొద‌ట సిమ్రన్ (simran) ఫేస్‌ని వాడార‌ని.. త‌మ‌న్నా కావాల‌య్యా (kavalayya) పాట‌కు డ్యాన్స్ చేస్తున్న వీడియోని తీసి అందులో త‌మ‌న్నా (tamanna) ఫేస్‌కి బ‌దులు సిమ్ర‌న్ ఫేస్‌ని వాడార‌ని గుర్తుచేసారు గాయ‌ని చిన్మ‌యి శ్రీపాద‌ (chinmayi sripaada). అయితే ఆ వీడియో చేయ‌డానికి సిమ్రన్ నుంచి అనుమ‌తి తీసుకున్నారో లేదో తెలీదు కానీ సిమ్ర‌న్ కూడా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేసిన‌ట్లు తెలిపారు.

ఇదివ‌ర‌కు లోన్ యాప్స్ వారు ఎవ‌రికైనా లోన్ ఇచ్చి వారు తిరిగి చెల్లించినా చెల్లించ‌క‌పోయినా అమ్మాయిల ఫోటోల‌ను ఇలా మార్ఫ్ చేసి బెదిరించేవార‌ని ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వీడియోతో మ‌రింత రెచ్చిపోయే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌ను వాడుకుని ఎన్నో దారుణాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఇక డీప్ ఫేక్ వీడియోలు అడ్డంపెట్టుకుని దోపిడీ, అత్యాచారాల‌కు కూడా పాల్ప‌డ‌తార‌ని అన‌డంలో ఏమాత్రం సందేహం లేద‌ని హెచ్చ‌రించారు.