Bishnoi Mahasabha: సల్మాన్ కుటుంబమే అబద్ధాల పుట్ట
Bishnoi Mahasabha: తన కొడుకు సల్మాన్ ఖాన్ చీమకు కూడా హాని చేయడని సలీమ్ ఖాన్ చెవులో పూలు పెడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు బిష్ణోయ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర బుధియా. చీమకు హాని తలపెట్టని వాడికి కోర్టు నేరం రుజువు చేసి శిక్ష ఎలా వేస్తుంది అని ప్రశ్నించారు.
“” సల్మాన్ ఖాన్ కుటుంబమే అబద్ధాల పుట్ట. వారి మాటలు నమ్మకండి. కృష్ణ జింకను సల్మాన్ వేటాడి చంపిన మాట నిజం. అందుకే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కానిదే కోర్టు శిక్ష వేస్తుందా. సల్మాన్ మూడు రోజులు జైల్లో ఉండి బెయిల్పై బయటికి వచ్చాడు. అసలు శిక్ష అనుభవించనేలేదు. మా బిష్ణోయ్ వర్గం డబ్బులకు ఆశపడదు. మా వర్గంలోని ఆడవాళ్లు తమ కన్నబిడ్డలకు చనుబాలు ఇస్తారో లేదో తెలీదు కానీ కృష్ణజింకలకు తమ పాలు పట్టేవారు. రాజుల కాలంలో చెట్లను నరికేస్తుంటే మమ్మల్ని చంపండి చెట్లను వదిలేయండి అని 300 మంది ఆడవాళ్లు ప్రాణాలు అర్పించారు. అలాంటిది మా జింకను వేటాడి చంపావ్. ఊరుకుంటామా? తప్పు ఒప్పుకుని మా వెయ్యేళ్ల నాటి ఆలయానికి వచ్చి క్షమాపణలు చెప్తే లారెన్స్ వదిలేస్తాడేమో. లేదంటే మీ ఇష్టం. ఇంతకుమించి నేనేమీ చెప్పలేను “” అని తెలిపారు.