Nenu Student Sir Trailer: మరో ‘ఇడియట్​’ అవుతుందా?

Hyderabad: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) చిన్న కొడుకు బెల్లంకొండ సాయి గణేష్(Bellamkonda Sai Ganesh) ‘స్వాతిముత్యం’(Swathi Muthyam) సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టకపోయినా మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మొదటి సినిమాతోనే స్వాతిముత్యం అనిపించుకున్న గణేష్ ‘నేను స్టూడెంట్ సర్’(Nenu Student Sir) అంటూ తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో సాయి గణేష్, అవంతిక దాసాని జంటగా నటించిన ఈ చిత్రం SV2 బ్యానర్ పై నాంది సతీష్ వర్మ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

‘ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన సుబ్బారావు అనే స్టూడెంట్.. రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఫోన్ కొనుక్కుంటాడు. ఆ ఫోన్ కు బుచ్చిబాబు అని పేరుకూడా పెడతాడు. ఇక ఆ ఫోన్ కొన్న ఆనందంలో ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఫోన్ లో అనుకోకుండా ఒక హత్యకు సంబంధించిన వీడియో రికార్డ్ అవుతుంది. ఆ హత్య చేసింది సుబ్బారావు అని కాలేజ్ మొత్తం తెలుస్తుంది. అసలు ఆ హత్యకు, తనకు సంబంధం లేదని సుబ్బారావు చెప్పుకొస్తున్నా.. అతడినే దోషిగా నిలబెట్టడానికి కమిషనర్ రంగంలోకి దిగుతాడు. అసలు సుబ్బారావుకీ, కమిషనర్​కి మధ్య ఏం జరిగింది? ఆ హత్య చేసింది ఎవరు?’ అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్​ అయ్యేవరకు ఆగాల్సిందే. ఇక కమిషనర్ గా సముద్రఖని నటించారు. జూన్ 2 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, కమిషనర్​, స్టూడెంట్​ మధ్య సాగే ఈ కథ రవితేజ(Raviteja) నటించిన ఇడియట్(Idiot)​ సినిమాను పోలి ఉందంటున్నారు నెటిజన్లు.