Govinda: జ్యోతిష్యమే అతని కెరీర్‌ను మింగేసింది
Govinda: మన దేశంలో జ్యోతిష్యాన్ని నమ్మేవారి సంఖ్య కోకొల్లలు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఇలా ఎందరో జ్యోతిష్య శాస్త్రాన్ని చాలా బలంగా నమ్ముతారు. దీని వల్ల కెరీర్‌లో నిలదొక్కుని తమకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే.. ఈ జ్యోతిష్యాన్ని గుడ్డిగా నమ్మి తన కెరీర్‌నే నాశనం చేసుకున్నారట బాలీవుడ్ నటుడు గోవింద. ఈ విషయాన్ని కోమల్ నహ్తా అనే సినీ విశ్లేషకుడు బయటపెట్టారు. గోవింద బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు ఉండేంత క్రేజ్ ఉండేది.
ఎంత రెమ్యునరేషన్ కావాలన్నా ఇచ్చేవారు. ఏడాదిలోనే 10 సినిమాలు చేస్తుండేవాడు. ఆ సమయంలో ఓ జ్యోతిష్యుడు గోవింద జీవితంలోకి వచ్చి అంతా నాశనం చేసేసాడట. ఓసారి గోవింద ఓ జ్యోతిష్యుడిని కలిసినప్పుడు పెన్నుల వల్ల నీ జీవితం నాశనమైపోతుంది అని చెప్పాడట. దీని అర్థం ఏంటంటే.. జర్నలిస్ట్‌లు తప్పుడు వార్తలు రాసే ప్రమాదం ఉంది.. ఆ వార్తల వల్ల సినీ కెరీర్ పడిపోతుంది అని. కానీ గోవింద అలా అర్థంచేసుకోకుండా పెన్నులనే దూరంగా పెట్టాడట.
జీతో చప్పడ్ ఫాడ్ కే అనే షోకి గోవింద వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో ఈ షోలో పాల్గొనేవారు ఎవ్వరూ కూడా పెన్నులు తెచ్చుకోవద్దు అనే నియమం పెట్టాడట. అంతేకాదు.. షూటింగ్ సమయంలో సెట్స్‌లోని ఇతర నటీనటులను ఫలానా దుస్తులు వేసుకోవద్దని.. ఫలానా రంగులు ధరించవద్దంటూ టార్చర్ పెట్టేవాడట. ఇలా రాను రాను మరింత దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి సెట్‌లో ఛాండిలియర్ పడిపోతుందని.. అందరూ పక్కకు జరగాలని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడట. వారంలోని కొన్ని రోజుల్లో ఎలాంటి పనులు చేయనని.. షూటింగ్‌లకు కూడా రాను అని చెప్పేవాడు. అలా మెల్లిగా గోవింద కెరీర్ పడిపోయింది. అతనికి సినిమాలు తగ్గిపోయాయి. 2019లో గోవింద నటించిన చివరి సినిమా రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన చేతిలో సినిమాలు లేవు. దాంతో శివసేన పార్టీలో చేరి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు.