Ashish Vidyarthi సినిమాల్లేక ఇబ్బందిపడుతున్నారా?
Hyderabad: విలన్ క్యారెక్టర్లో ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన ఆశిష్ విద్యార్ధి (ashish vidyarthi) ఇప్పుడు సినిమా అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన తన ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేస్తూ.. అసలు సినిమాల వైపు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా అప్పటికే పెద్దవాళ్లైన తన తల్లిదండ్రులకు మెరుగైన జీవితాన్ని అందించడానికి సినిమాల వైపు వచ్చానని తెలిపారు. ఇప్పుడు కూడా ఆఫర్స్ వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు.
“నేను నటించడానికి రెడీగా ఉన్నాను. మనం చేసే పనే మనమేంటో తెలియజేసేలా ఉండాలి. మన జీవితంలోని ఎక్కువ రోజులను మెరుగైన జీవితాన్ని అనుభవించడానికే కష్టపడుతుంటాం. మరి అలాంటి రోజుల గురించి బయటికి చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి. అమ్మానాన్నలకు నేను ఒక్కడినే. నేను సినిమాల్లోకి వచ్చినప్పటికే వారు పెద్దవారు. వారికి బెటర్ లైఫ్ ఇవ్వాలనుకున్నాను. అందుకే నచ్చకపోయినా ఏ క్యారెక్టర్ ఇస్తే అందులో చేసే వాడిని. అలా నాకు దాదాపు అన్నీ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్సే వచ్చాయి. కానీ నేను వాటి గురించి గొప్పగా చెప్పుకోలేను. ఎందుకంటే అవి నెగిటివ్ క్యారెక్టర్స్ కాబట్టి. ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఎందరో తిట్టుకున్నారు. అవన్నీ అనుభవించాను. కాబట్టి మీ జీవితాన్ని నిర్భయంగా జీవించండి. మీరు ఎంత కష్టపడి పనిచేసేవారో నలుగురికీ తెలియజేయండి. మీకు నచ్చిన పనిని ఎంచుకోండి. సొసైటీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకేం కావాలో మీకంటే బాగా ఎవరికి తెలుస్తుంది” అని పోస్ట్‌లో పేర్కొన్నారు ఆశిష్. (ashish vidyarthi)