Asha Parekh: అమితాబ్​కి రాసినప్పుడు మాకెందుకు రాయరు?

Mumbai: సాధారణంగా సీనియర్ హీరోలు, హీరోయిన్స్ చిన్నచిన్న పాత్రలు చేస్తుంటారు. తండ్రి, తాత పాత్రలు లేదా అతిథి పాత్రల్లో కనిపిస్తారు. కానీ ఇటీవల సీనియర్ హీరోలు సైతం ఇంకా హీరోలుగానే రాణిస్తున్నారు. లేకపోతే తమ వయస్సుకు తగిన కొత్త కథలతో ప్రేక్షకులని పలకరిస్తున్నారు. కానీ సీనియర్ హీరోయిన్స్ కి మాత్రం అక్క, తల్లి, బామ్మ పాత్రలే ఇస్తున్నారు. తాజాగా దీనిపై బాలీవుడ్(Bollywood) సీనియర్ నటి ఆశా పరేఖ్(Asha Parekh) వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.
తాజాగా బాలీవుడ్ లో అమెజాన్ ఈ మైత్రి – ఫిమేల్ ఫస్ట్ కలెక్టివ్ అనే ప్రోగ్రాంని నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి ఆషా పరేఖ్ ఇప్పుడు వచ్చే కథలపై, ఇంకా హీరోలకు, హీరోయిన్స్ కు మధ్య ఉన్న బేధంపై ఫైర్ అయ్యారు.

ఈ ప్రోగ్రాంలో ఆశా పరేఖ్ మాట్లాడుతూ.. అమితాబ్(Amitabh Bachchan) ఈ వయసులో కూడా మెయిన్ లీడ్స్ లో పాత్రలు చేస్తున్నారు. అతని కోసమే ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు. గత సంవత్సరం అమితాబ్ బ్రహ్మాస్త్ర(Brahmastra), ఝండ్, రన్‌వే 34, ఉంచై, గుడ్‌బై(Good Bye) సినిమాల్లో ముఖ్య పాత్రలు చేశారు. మనకు ఎందుకు అలాంటి పాత్రలు రాయరు. సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు మనకు కూడా రావాలి. సీనియర్ హీరోయిన్స్ అంటే అమ్మగానో, అమ్మమ్మలుగానో వాడుకుంటున్నారు. అవి చేయడానికి ఎవరికి ఆసక్తి ఉంది. హీరోలు 50 ఏళ్ళు దాటినా ఇంకా యువ హీరోయిన్స్ తో కలిసి పనిచేస్తున్నారు. కానీ మాకు సైడ్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మారాలి, మహిళా నటుల కోసం ప్రత్యేకంగా పాత్రలు రావాలి అని వ్యాఖ్యానించారు. దీంతో ఆశా పరేఖ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.