RRR మరో రికార్డు.. ఆస్కార్ వేదికపై లైవ్‌లో ‘నాటు నాటు..’!
ప్రపంచ సినీ వేదికపై రికార్డులు సృష్టిస్తున్న RRR సినిమాలోని ‘నాటు నాటు…’ పాట ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ పాట ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్కార్ అవార్డుకు కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. తద్వారా తెలుగు నుంచి నామినేట్ అయిన మొట్టమొదటి సాంగ్‌గా నాటు నాటు రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆస్కార్ వేదికపై తెలుగు గాయకులు రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ కలిసి RRR మూవీలోని ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో పాడబోతున్నారు.
భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా భారీ హిట్ కొట్టి రికార్డులు సృష్టించడంతో పాటు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సినిమా RRR (రౌద్రం రణం రుధిరం). ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి సత్తా చాటింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ పేరు మారుమ్రోగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది.
RRR సినిమాని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్లో వచ్చిన ఈ సినిమాలోలో చరణ్.. రామరాజుగా, తారక్.. కొమరం భీంగా నటించి తెలుగు ప్రేక్షకులనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను మెప్పించారు.
ఎన్నో అవార్డులు..
RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధించింది. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం.. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ పురస్కారాల్లో ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులను గెలిచి అంతర్జాతీయ వేదికపై ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు సినిమాగా చరిత్రను సృష్టించింది.
ఆస్కార్ బరిలో నాటు నాటు..
95వ అకాడమీ (ఆస్కార్) అవార్డు కోసం RRR సినిమాలోని నాటు నాటు పాట నామినేట్ అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాటతో పాటు మరో నాలుగు సాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఇందులో విజేతగా నిలుస్తుందో లేదో మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. 95వ అకాడమీ (ఆస్కార్) అవార్డులను 2023 మార్చి 12వ తేదీన ప్రకటించబోతున్నారు. అదే రోజున ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. తారల తళుకుబెళుకుల మధ్య సాగే ఈ వేడుకను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో నిర్వహించబోతున్నారు. దీనికి పలు దేశాల నటీనటులు, టెక్నీషియన్లు హాజరు కాబోతున్నారు.
లైవ్‌లో తెలుగు పాట..
2023 మార్చి 12వ తేదీన లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగబోతున్న 95వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల కార్యక్రమంలో.. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ కలిసి RRR మూవీలోని ‘నాటు నాటు’ పాటకు లైవ్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆస్కార్ అవార్డుల వేదికపై తెలుగు సింగర్లు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. తద్వారా కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ అరుదైన ఘనతను సాధించబోతున్నారు. ఇది వాళ్లకే కాదు తెలుగు వాళ్లందరికీ గర్వకారణం అంటూ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు సంబరపడుతున్నారు.