Ghajini2: అమీర్ ఖాన్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా?
Hyderabad: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్(Murugadoss) దర్శకత్వంలో సూర్య(Suriya) హీరోగా రూపొందిన సినిమా గజిని(Ghajini). 2008లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసింది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోకి డబ్ అయి భారీ విజయం అందుకుంది. కాగా, సౌత్‌లో ఘన విజయం సాధించిన ఈ సినిమాని అమీర్ ఖాన్(Aamir Khan) హీరోగా హిందీలో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన మురుగదాస్ హిందీలోనూ ఈ సినిమాను తెరకెక్కించి బాలీవుడ్(Bollywood)లోనూ సూపర్ హిట్ అందుకున్నారు.
బాలీవుడ్‌లోనూ రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ను దక్కించుకున్న గజిని సినిమాను గీతా ఆర్ట్స్(Geetha Arts) బ్యానర్‌పై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) నిర్మించారు. ఆ సినిమా తో అల్లు అరవింద్ భారీ మొత్తంలో లాభాలను దక్కించుకున్నారు. అమీర్ ఖాన్, అల్లు అరవింద్ కెరీర్లో మైల్‌స్టోన్‌గా నిలిచిన సినిమా గజిని. అందుకే వీరిద్దరికీ ఈ సినిమా పై ప్రత్యేక అభిమానం.
ఇక, తాజాగా గజిని సినిమా సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మురుగదాస్ సీక్వెల్‌పై ఆసక్తిగా లేకపోవడంతో స్వయంగా అమీర్ ఖాన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుని గజిని సినిమా సీక్వెల్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో అమీర్ ఖాన్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోయింది. లాల్‌సింగ్ చద్దా డిజాస్టర్ తర్వాత కాస్త సైలెంట్ అయిన అమీర్ గజినీ సీక్వెల్‌తో సక్సెస్ బాట పట్టాలని ఆలోచిస్తున్నారు. అందుకే దక్షిణాదిన గజిని సీక్వెల్ ఉంటుందో లేదో తెలీదు గానీ హిందీలో మాత్రం గజిని 2(Ghajini2) ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.