Ugram: ట్రైలర్​ రిలీజ్​.. అల్లరోడు ఉగ్రరూపం చూపించాడుగా!

Hyderabad:వెండితెరకు పరిచయం చేసిన తన మొదటి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్​(Allari Naresh).వరుస హాస్యభరిత సినిమాలతో టాలీవుడ్ కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నరేష్ భిన్నమైన పాత్రలతోనూ అలరిస్తున్నారు. 2021 లో నాంది (Naandhi) అనే సీరియస్ క్రైమ్ డ్రామా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. తనకు బాగా అలవాటైన కామెడీ జోనర్​ని పక్కన పెట్టి చేసిన ఈ సినిమా హిట్​ అవ్వడమే కాదు, నరేష్​లోని భిన్నమైన నటుడిని అభిమానులకు పరిచయం చేసింది. కొంతకాలంగా హిట్​ లేక బాధపడిన నరేష్​ కెరీర్​ని మళ్లీ గాడిలో పడేట్టు చేసిన సినిమా నాంది.

కామెడీ కథలకే కాకుండా ఇతర జోనర్ చిత్రాలను కూడా ఓకే చేస్తున్నారు నరేష్​. ఈ క్రమంలోనే గత ఏడాది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. తాజాగా మరోసారి నాంది మూవీ డైరెక్టర్ తో కలిసి ఉగ్రం అనే సినిమాతో వస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన నాంది సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో నరేష్ తనలోని ఉగ్రం మొత్తం చూపించనున్నాడు. ఈ మూవీలో అల్లరి నరేష్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. రాష్ట్రంలో మిస్ అవుతున్న ప్రజలను కనిపెట్టేందుకు నరేష్ ఫైట్ చేస్తుంటారు. ఈ క్రమంలోని తన భార్య, పిల్ల కూడా కనిపించకుండా పోతుంది. చివరికి వాళ్ళని కనిపెట్టాడా? లేదా? అనేది మూవీ స్టోరీ అని తెలుస్తుంది. విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మిర్నా మీనన్ (Mirnaa Menon) హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్​తో ఉగ్రం(Ugram)తో మరోసారి నరేష్​(Allari Naresh) నట ఉగ్రరూపాన్ని చూడబోతున్నామని అర్థమవుతోంది.