Agent: సినిమా ప్రమోషన్స్​ కోసం అఖిల్​ సాహసం!

Vijayawada:  టాలీవుడ్​ హీరో అక్కినేని అఖిల్(Akkineni Akhil) తాజాగా నటించిన సినిమా ఏజెంట్(Agent). ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా కష్టపడ్డాడు అఖిల్​. కెరీర్ లో మొదటి సారి పూర్తి మాస్, యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు వచ్చిన అఖిల్ సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) తప్ప మిగిలిన సినిమాలన్నీ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో అఖిల్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో  సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు అఖిల్​. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో PVP మాల్ వద్ద ట్రైలర్ టైం అనౌన్సమెంట్ అంటూ సరికొత్త ప్రమోషన్స్ చేశారు. విజయవాడలో PVP మాల్ వద్ద ఏజెంట్ ప్రమోషన్స్ నిర్వహించగా ఇక్కడ అఖిల్ 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సహాయంతో కిందకి దూకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. PVP మాల్ బిల్డింగ్ పైనుంచి అఖిల్ దూకగా కింద అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. అఖిల్ కిందకు దిగుతుంటే అఖిల్ పై పూల వర్షం, పేపర్స్ కురిపించారు.

సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో సాక్షి వైద్య(Sakshi Vaidya) హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో ఏజెంట్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.