Agent: డైరెక్ట‌ర్ పేరు తీయ‌ని అఖిల్.. కోప‌మా?

Hyderabad: టాలీవుడ్​ యంగ్​ హీరో అఖిల్​ అక్కినేని(Akhil Akkineni), సాక్షి వైద్య(Sakshi Vaidya) జంటగా నటించిన సినిమా ఏజెంట్(Agent). ఈ సినిమాలో మలయాళ స్టార్​ మమ్ముట్టి(Mammootty) ముఖ్య పాత్రలో నటించారు. సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వం వహించిన ఈ సినిమాని అనిల్ సుంకర భారీ బడ్జెట్​తో నిర్మించారు. అఖిల్ మొదటి సారి ఫుల్ మాస్, యాక్షన్ రోల్ లో కనిపించిన ఈ సినిమా ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య రిలీజైంది. కానీ అరకొరగా ఉన్న కథ, కథనం, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులనే కాదు అక్కినేని అభిమానులని కూడా మెప్పించలేక డిజాస్టర్​గా మిగిలింది.

ఈ సినిమా కోసం అఖిల్​ చాలా కష్టపడ్డాడు. రెండేళ్లు మరే ప్రాజెక్ట్​ ఒప్పుకోకుండా బాడీ కూడా పెంచాడు. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక తాజాగా అఖిల్ ఏజెంట్ సినిమా ఫలితంపై మొదటిసారి స్పందించారు. సోషల్ మీడియాలో ఓ స్పెషల్ నోట్ షేర్​ చేశాడు.

‘ఏజెంట్ సినిమాకు ప్రాణం పోయడానికి తమ జీవితాన్ని అంకితం చేసిన నటీనటులకు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మేము మా స్థాయిలో చాలా బాగా అవుట్‌పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమా మేము అనుకున్నట్టు తెరపై మెప్పించలేకపోయింది. మీ కోసం మేము మంచి సినిమాను అందించలేకపోయాం. నాకు చాలా బాగా సపోర్ట్ చేసిన నిర్మాత అనిల్ సుంకర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాపై, మా సినిమాపై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్స్, మాకు సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. మీరిచ్చే ప్రేమ, శక్తి నన్ను ఇంకా పనిచేసేలా చేస్తున్నాయి. నన్ను నమ్మిన వారికోసం నేను మళ్ళీ బలంగా తిరిగివస్తాను’ అని రాసుకొచ్చాడు అఖిల్​. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఇందులో అఖిల్​ డైరెక్టర్​ సురెందర్​ రెడ్డి గురించి ప్రస్తావించకపోవడం చర్చకు దారితీస్తోంది. మర్చిపోయాడా.. కోపంగా ఉన్నాడా? అంటూ నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు.