ఐష్​, చియాన్​ కాంబోలో మరో సినిమా!

Chennai:  క్లాసిక్​ డైరెక్టర్​ మణిరత్నం(Mani Ratnam) సినిమాలే కాదు ఆయన కాంబినేషన్స్​ కూడా క్రేజీగా ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబోల్లో ఒకటి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan)​, చియాన్​ విక్రమ్(Vikram)​ జంట. తెరపై వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. అంతేకాదు, ఎవర్​గ్రీన్​ కాంబినేషన్స్​గా నిలిచిన మణిరత్నం హీరోహీరోయిన్లే కాదు, మల్టీస్టారర్స్​లోనూ స్పెషలే. రజనీకాంత్‌(Rajinikanth), మమ్ముట్టి(Mammootty), అరవింద్‌ స్వామి(Aravind Swamy) కాంబినేషన్‌లో దళపతి(Dalapathi) చిత్రం చేసిన మణిరత్నం ఆ తరువాత శింబు, అరవింద స్వామి, విజయ్‌ సేతుపతి, ప్రకాష్‌ రాజ్‌, జ్యోతిక, అదితి రావు కాంబోలో చెక్క చివంద వానం రూపొందించారు. ఇక తాజాగా విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌ కుమార్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రభు వంటి ప్రముఖ తారాగణంతో పొన్నియిన్‌ సెల్వన్‌, పొన్నియన్​ సెల్వన్​ 2(PS2)  వంటి చిత్రాలను తెరకెక్కించి ఘన విజయం అందుకున్నారు.

ముఖ్యంగా పొన్నియిన్‌ సెల్వన్‌– 2 చిత్రంలో మాజీ ప్రేమికులైన విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు మణిరత్నం. కాగా, ఈ సినిమా తర్వాత మళ్లీ క్రేజీ కాంబినేషన్‌ అయిన ఐష్​, చియాన్​తో చిత్రం చేయబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం చియాన్​ విక్రమ్​ తంగైలన్​ చిత్ర షూటింగ్​లో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా ఈ సినిమా పూర్తయిన వెంటనే మణిరత్నం డైరెక్షన్లో  విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌ హీరో హీరోయిన్లుగా సినిమా రూపొందనున్నట్లు కోలీవుడ్‌ టాక్‌. ఈ కాంబినేషన్లో ఇంతకుముందు మణిరత్నం రావణన్‌(Ravanan), రావణ్(Ravan)​ అనే చిత్రాలు రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా పొన్నియన్​ సెల్వన్(PS)​తో అలరించిన ఈ జంట మరోసారి తెరపై కనిపిస్తే నిజంగా పండగే అంటున్నారు అభిమానులు.