Adipurush: రాముడి పోస్ట‌ర్ కాపీ కొట్టేసారా రౌత్ గారూ?

Hyderabad: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్(Prabhas) రాముడిగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆదిపురుష్​(Adipurush)పై చాలా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ప్రభాస్ ని రాముడిగా చాలా గొప్పగా ఊహించుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్​ వారి ఆశలను పటాపంచలు చేసింది.

రామాయణం అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని విమర్శలు వచ్చాయి. పోనీ అలా అయినా రామాయణం చూపిస్తారు అనుకుంటే రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని విమర్శించారు.

ఇలా అన్ని వైపులా ఆదిపురుష్ వివాదాల్లో నిలిచింది. అంతే కాకుండా హిందూ మనోభావాలు దెబ్బ తీశారని పలువురు ఆదిపురుష్ సినిమాపై పలుచోట్ల కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది ఆదిపురుష్​ సినిమా.

తాను గీసిన రాముడి గెటప్​ను కాపీ చేశారంటూ ప్రతీక్​ సంఘర్​ అనే వ్యక్తి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. కొంతమంది ప్రతీక్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుండగా, మరికొంత మంది మాత్రం ‘ఆదిపురుష్ సినిమా రెండేళ్ల క్రితమే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. నువ్వు సంవత్సరం క్రితం గీశావని చెప్తున్నావ్’ అంటూ ప్రతీక్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ప్రతీక్, TP విజయన్ పోస్ట్ చేసిన రాముడు ఆర్ట్స్ రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. ప్రతీక్ సంవత్సరంన్నర క్రితమే తన సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేయగా, TP విజయన్ కొన్ని నెలల క్రితం వీటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నిజంగానే కాపీ కొట్టారా అని అంతా అనుకుంటున్నారు.

ఆదిపురుష్​లో ప్రభాస్​ రాముడిగా కనిపించనుండగా, కృతిసనన్(Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.