2018 Movie: ఒక్క భాషలోనే 100 కోట్లు వసూలు !

Kerala: ఇండియన్​ సినిమాలో మాలీవుడ్(Mollywood)​ది పత్యేక స్థానం. తక్కువ బడ్జెట్ తో వాస్తవిక కథల ఆధారంగా స్థానికతకు దగ్గరగా ఉండే చిత్రాలకు మాలీవుడ్​ ప్రసిద్ధి. మలయాళ చిత్ర సీమ(Malayalam Cinema)లో రూపొందిన చాలా సినిమాలు తెలుగులోనూ రీమేక్​ అయి టాలీవుడ్​ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఇటీవల రిలీజైన 2018 సినిమా(2018 movie) బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. రూ.15కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రం మే 5న రిలీజ్​ అయ్యింది. కాగా కేవలం పది రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్షన్లను రాబట్టింది. అది కూడా ఇండియా రేంజ్​లో కాకుండా కేవలం మాలీవుడ్​లో ఈ కలెక్షన్స్​ను అందుకోవడం విశేషం.

టోవినో థామస్‌(Tovino Thomas) హీరోగా జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘2018’. ‘ఎవ్రీవన్‌ ఈజ్‌ ఏ హీరో’ అనేది క్యాప్షన్‌. క్యాప్షన్‌కు తగ్గట్లే ఈ కథ నడుస్తుంది. అంటే ఈ చిత్రంలో ప్రతిఒక్కరూ హీరోలే అని అర్థం. ఈ చిత్రంవాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు.. లక్షలాది జనాలు నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్నే కథాంశంగా తీసుకుని డైరెక్టర్‌ జూడ్‌ ఆంథనీ సినిమాను తెరకెక్కించారు. సామాన్యులు హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది చిత్రసారాంశం. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ఓ ప్రాంతంలో సహాయక చర్యలు ఏ విధంగా సాగాయి? ఆ సహాయక చర్యల్లో అక్కడి ప్రజలు ఎలా భాగమయ్యారు? చివరికి ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ. ఈ సినిమాను తెలుగులోనూ డబ్​ చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారట మేకర్స్​.