CoWIN: ప్ర‌పంచం చూపు మ‌న వెబ్‌సైట్ వైపు!

కోవిడ్.. యావ‌త్ ప్ర‌పంచాన్ని అల్లాడించిన మ‌హ‌మ్మారి. జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ఇలాంటి వైర‌స్ ఒక‌టి ఈ కాలంలోనూ వ్యాపిస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోయారు. మెడిసిన్లు అందుబాటులో లేని కాలంలో ఇలాంటి వ్యాధులు ఉండేవ‌ని, స‌రైన వైద్య స‌దుపాయాలు లేక ఎంద‌రో ప్ర‌జ‌లు చ‌నిపోతుండేవార‌ని పుస్త‌కాల్లో చ‌దువుకున్నాం కానీ మ‌నం కూడా ఇలాంటి వైర‌స్‌ను ఎదుర్కుంటాం అని అనుకోలేదు. దాంతో దీని విరుగుడుకి వెంట‌నే వ్యాక్సిన్‌, మందులు క‌నిపెట్టాల‌ని ఎందరో సైంటిస్టులు రాత్రింబవ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. అలా మ‌న‌కు కోవిషీల్డ్, కోవాగ్సిన్ అనే వ్యాక్సిలు అందుబాటులోకి వ‌చ్చాయి.

ఈరోజు వ‌ర‌కు చూసుకుంటే 1.3 బిలియ‌న్ మంది ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందింది. ఈ కోవిషీల్డ్, కోవాగ్సిన్ వ్యాక్సిన్‌ల‌ను క‌నిపెట్టింది మ‌న భార‌తీయ ఫార్మా ఏజెల్సీనే కావ‌డంతో ప్ర‌పంచానికే మ‌నం ఆద‌ర్శంగా నిలిచాం. అంతేకాదు.. ఇలాంటి క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో భార‌త్ ఎప్పుడూ అండ‌గా ఉంటుంది అని రుజువు చేయ‌డానికి దాదాపు 100 దేశాల‌కు 232.43 మిలియ‌న్ డోసుల‌కు ఎగుమ‌తి చేసాం. ఈ వ్యాక్సిన్ల త‌యారీలో భాగంగా రీసెర్చ్ కోసం భార‌త ప్ర‌భుత్వం దాదాపు 900 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసింది. వివిధ సైంటిస్టులు ఏక‌మై వేలాది ప‌రిశోధ‌న‌లు చేసి అస‌లు వైర‌స్ ఎలా రూపాంతరం చెందుతోందో క‌నుక్కోగ‌లిగారు. సైంటిస్టుల‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల‌ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌ధాని మోదీ కారణంగానే ఇత‌ర దేశాల సాయం లేకుండా కోవిడ్‌ను అరిక‌ట్ట‌గ‌లిగిన దేశాల్లో భార‌త్ ఐదో స్థానంలో నిలిచింది. ఎన్నో ప‌రిశోధ‌న‌లు చేసిన త‌ర్వాత మొత్తానికి భార‌త్ వ్యాక్సిన్ల‌ను త‌యారుచేసింది. కానీ వ్యాక్సిన్లు త‌యారుచేయ‌డం కంటే వాటిని ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌డంలోనే చాలా రిస్క్ ఉంటుంది. అయినా కూడా ప్ర‌భుత్వం ధైర్యం చేసి ముందుకు వెళ్లింది. అలా వ్యాక్సిన్ల విష‌యంలో భార‌త్ సక్సెస్ అయింది.

ఈ సంద‌ర్భంగా హిస్ట‌రీ టీవీ నిర్వ‌హించిన డాక్యుమెంట‌రీలో ప్రధాని మోదీ కోవిడ్ వ్యాక్సిన్ల గురించి త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. “కోవిడ్ స‌మ‌యంలో కోవిన్ భార‌త‌దేశానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ వ్యాక్సిన్లు తీసుకోవ‌చ్చో సులువుగా తెలుసుకోగ‌లిగాం. ఈ విష‌యంలో మ‌న‌కు టెక్నాల‌జీ ఎంతో ఉప‌యోగ‌ప‌డింది” అని తెలిపారు. ఇప్పుడు కోవిన్ ప్లాట్‌ఫాంను మెరుగుప‌రిచి మరిన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చే ప‌నిలో ఉన్నామ‌ని ఈ సంద‌ర్బంగా మోదీ తెలిపారు. కోవిన్ పోర్ట‌ల్ విష‌యంలో ఓ సాధార‌ణ వ్య‌క్తి నుంచి వీవీఐపీ వ‌ర‌కు అంద‌రికీ పార‌ద‌ర్శ‌కంగా ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్ట‌ర్ ఆర్‌.ఎస్ శ‌ర్మ తెలిపారు. అందుకే ఇండియాలో కోవిన్ స‌క్సెస్ అయింద‌ని అన్నారు. కెన‌డా, మెక్సికో, నైజీరియాల‌తో పాటు మ‌రో 50 దేశాలు ఇప్పుడు కోవిన్ లాంటి పోర్ట‌ల్‌ను ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నాయ‌ట‌. ఇందుకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా ఇవ్వ‌డానికి భార‌త్ కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు ఈ సంద‌ర్భంగా మోదీ తెలిపారు. మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్ధాప‌కుడు బిల్ గేట్స్‌కి చెందిన ఫౌండేష‌న్ సీఈవో మార్క్ సుజ్మ‌న్ కూడా కోవిన్ పోర్ట‌ల్‌ను అభినందించారు.