పొత్తు ఉందా లేదా.. ఢిల్లీలో పవన్‌ పర్యటన అందుకేనా?

వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రయోగాలు చేయనని… ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తానని గత నెలలో జరిగిన జనసేన బహిరంగ సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. దీంతోపాటు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఎందుకు చెబుతున్నానో ఆయన కార్యకర్తలకు తెలిపారు. అంతేకాకుండా.. ఏపీ, తెలంగాణలో బీజేపీ పార్టీ నాయకులు జనసేనతో వ్యవహరిస్తున్న తీరును సైతం బహిరంగంగానే అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీని మాత్రం ఆయన ఏమీ అనలేదు. అయితే.. ఆ సమావేశంలో అందరికీ స్పష్టమైన విషయం ఏమిటంటే… రానున్న ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతో గౌరవప్రదంగా పొత్తులు పెట్టుకునే ఆలోచన ఉన్నట్లు పవన్‌ పరోక్షంగా అందరికీ తెలియజేశారు. ఇక బీజేపీని పట్టించుకోను అన్నరీతిలో పవన్‌ రాజకీయాలు సాగిస్తున్న తరుణంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకి పిలుపు రావడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవలే జగన్‌ ఢిల్లీ వరుసగా రెండు సార్లు వెళ్లిరాగా.. టీడీపీతో బీజేపీ పెద్దలు సైతం రెండు రోజుల కిందట సమావేశం నిర్వహించారు. ఇదే నేపథ్యంలో పవన్‌ను ఢిల్లీకి ఎందుకు పిలిచారు అన్న దానిపై పూర్తిగా స్పష్టత లేకపోయినప్పటికీ.. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అన్న అంశాలు, ఏపీ, తెలంగాణలో బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ఏపీ రాజకీయాలపై పవన్‌.. పెద్దలతో చర్చించనున్నట్లు సమాచారం.

మూడు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా..
2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీలు కలిసి అప్పట్లో ఎన్నికలకు వెళ్లగా.. టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. అయితే.. ఆ తర్వాత జనసేనను టీడీపీ, బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. దీంతోపాటు పవన్‌ అడిగిన పలు సమస్యలను ఆ రెండు పార్టీలు పరిష్కరించలేదు. దీంతో 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీ పార్టీలతో కలిసి పవన్‌ ఎన్నికలకు వెళ్లగా.. దారుణంగా ఓడిపోయారు. అంతేకాదు.. ఎక్కడికక్కడ ఓట్లు చీలిపోవడంతో అధికారంలో ఉన్న టీడీపీ కాస్తా చాలాచోట్ల డిపాజిట్లు కూడా రాకుండా.. కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఈ ఫలితాల తర్వాత తేరుకున్న టీడీపీ… జనసేన పార్టీ వేరుగా పోటీ చేయడం వల్ల తమ ఓటు బ్యాంకు చీలిపోయిందని… అది వైసీపీకి కలిసి వచ్చిందని తెలుసుకుంది. అప్పటి నుంచి పవన్‌తో సత్ససంబంధాలు నెరుపుతూ వస్తోంది. మరోవైపు బీజేపీ కూడా జనసేనకు సీట్లు రాకపోయినా దాదాపు ఏడు శాతం ఓటింగ్‌ రావడంతో జనసేన బీజేపీ పొత్తులో వెళ్తే బాగుంటుందని భావించి.. అడపాదడపా కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. అయితే.. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.. ఇక కొత్త అంశం ఏంటంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్‌ను టార్గెట్‌ చేస్తూ వస్తోంది. దీంతో ఆగ్రహించిన ఆయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం ఈ విషయంమై మౌనంగా ఉండటం పవన్‌కు మింగుడు పడటం లేదు. ఒకనొకదశలో బీజేపీ పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి. దీంతో టీడీపీ పార్టీకి జనసేనాని పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ నాయకులు పవన్‌తో వ్యవహరించిన తీరును చెప్పుకొచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖాయం అనుకుంటున్న తరుణంలో.. హస్తినకు పవన్‌ వెళ్లడం అంతటా ఆసక్తిగా మారింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేదా బీజేపీ జనసేన పార్టీలు రెండూ కలిసి ఎన్నికలకు వెళ్తాయా అన్నది తెలియాల్సి ఉంది.

బీజేపీ ప్లాన్‌ అదే..
ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి.. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే… అలవోకగా వైసీపీ అధికారంలోకి వస్తుంది. తద్వరా టీడీపీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు వయసు కూడా మీదపడుతుండటంతో.. ఆ పార్టీ పతనమై.. వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన పార్టీలు ఉంటాయని.. బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే.. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే.. క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీకి గట్టి కేడర్‌ ఉంది. ఈక్రమంలో రాజకీయ చదరంగంలో తన పార్టీ మనుగడ, తన మనుగడ కూడా ఎక్కడ పోతుందో అనే ఆలోచనకు వచ్చిన పవన్‌.. ఇప్పుడు రూట్‌ మార్చారు. రానున్న ఎన్నికల్లో కొన్ని సీట్లతోనైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని గట్టిగా భావిస్తున్నారు. దీనికోసం తోడ్పాటు అందించే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీలోని రాజకీయ పరిస్థితులు, తన ఆలోచనలను.. బీజేపీతో పొత్తు ఆవస్యకత.. వైసీపీ అరాచకాలు.. రానున్న ఎన్నికలపై వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వంటి వాటిని బీజేపీ అధిష్టానం దగ్గరికి పవన్‌ తీసుకెళ్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత బీజేపీ నుంచి పవన్‌కు ఏ మేరకు హామీ వస్తుంది. జనసేనాని నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.