Train Accident: రాజీనామాలతో పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?
Hyderabad: ఏదన్నా ఒక ఘటన జరగ్గానే అధికారంలో ఉన్న పార్టీని వేలెత్తి చూపడానికి సిద్ధంగా ఉంటాయి ప్రతిపక్ష పార్టీలు. ఇప్పుడు ఒడిశా రైలు ప్రమాద ఘటన (train accident) తర్వాత కూడా అదే జరుగుతోంది. నేను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క యాక్సిడెంట్ జరగలేదు అని TMC అధినేత్రి మమతా బెనర్జీ, నేను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగిన వెంటనే బాధ్యత నాదే అనుకుని రాజీనామా చేసాను అని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీడియా ముందు చెప్పుకుంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒడిశా ప్రమాదంతో బీజేపీకి గట్టి దెబ్బపడింది.
ఎందుకంటే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ BJPకి చెందిన వ్యక్తి. దాంతో చనిపోయిన 300 మందికి చెందిన కుటుంబాలకు సమాధానం చెప్పేది ఎవరు అంటూ ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఏకిపారేస్తున్నాయి. వారానికి ఒక ప్రదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండాలు ఊపుతూ ఫొటోలకు పోజులివ్వడంతోనే సరిపోయిందని, చనిపోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతులు, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించేస్తే సరిపోదని ఆరోపిస్తున్నాయి. ఈ దారుణ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఒకవేళ అశ్విని వైష్ణవ్ రిజైన్ చేసినా చనిపోయినవారి ప్రాణాలు తిరిగిరావు అన్న విషయం పలువురు పార్టీ నేతలు మర్చిపోతున్నారు. రైల్వే శాఖ మంత్రిగా వేరొకరు వచ్చినా ప్రమాదాలు అసలు జరగవు అని ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేరు. జరిగిన ప్రమాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పజెప్పింది. రైలు ప్రమాదం జరిగిన మూడు రోజుల తర్వాత ఈరోజు ఉదయం మరో గూడ్స్ రైలు ఒడిశాలో పట్టాలు తప్పింది. ఈ వార్త బయటికి రాగానే ఆ గూడ్స్ రైలు మాది కాదు అని రైల్వే శాఖ ప్రకటించింది. మరి ఎవరిది ఆ రైలు? అన్నది ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అంశం.