నానిపై నెగిటివ్ ప్ర‌చారం.. అందులో నిజ‌మెంత?!

నాని.. అష్టాచ‌మ్మా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మై నేచుర‌ల్ యాక్టింగ్‌తో నేచుర‌ల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ఉన్న‌ప్ప‌టికీ..మొన్న విడుద‌లైన ద‌స‌రా సినిమా మాత్రం ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయింది. ఎందుకంటే.. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలోనూ రిలీజ్ చేసారు. నాని కెరీర్‌లో ఇది మొద‌టి ప్యాన్ ఇండియ‌న్ సినిమాగా చెప్పుకోవ‌చ్చు. ఇక శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. మొద‌టిసారి నాని రా అండ్ ర‌గ్డ్ లుక్‌తో మాస్ యాక్టింగ్‌తో ఇర‌గ‌దీసార‌ని, నానిలో ఈ యాంగిల్ ఎన్న‌డూ చూడ‌లేద‌ని ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇవ‌న్నీ ప‌క్క‌న‌పెడితే.. నానిపై నెగిటివ్ ప్ర‌చారం జ‌రుగుతోంద‌ట‌. ప‌లు సోష‌ల్ మీడియా వ‌ర్గాలు ఈ మాట అంటున్నాయి. మెగా కాంపౌండ్ నుంచి నానికి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయ‌ని టాక్‌. మ‌రోప‌క్క ఏ చిన్న యాక్ట‌ర్‌నైనా, ద‌ర్శ‌కుడైనా మంచి సినిమా తీస్తే అభినందించేందుకు ముందుండే మెగాస్టార్ చిరంజీవి ద‌స‌రా సినిమా గురించి ఇప్ప‌టివ‌ర‌కు ఒక ట్వీట్ కూడా పెట్ట‌లేదు. అయితే ఆయ‌న ఇంకా సినిమా చూసి ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల ఎలాంటి ట్వీట్ చేయ‌లేదు అనుకోవ‌చ్చు. అయితే ఓ మెగా ఫ్యాన్.. ద‌స‌రా సినిమాకు సోషల్ మీడియాలో వ‌స్తున్న క‌లెక్ష‌న్లు త‌ప్పని, నిజానికి రోజుకి ల‌క్ష‌ల్లో కాకుండా వేల‌ల్లో క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయ‌ని ట్వీట్ చేసాడు. మెగా ఫ్యాన్ అయినంత మాత్రాన మ‌రో హీరోకి వ‌స్తున్న క‌లెక్షన్లు త‌ప్ప‌ని ఎలా చెప్తున్నాడు? అత‌నికి థియేట‌ర్ ఓనర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు స‌ప‌రేట్‌గా ఫోన్ చేసి ఏమైనా చెప్పారా? అంటూ నాని ఫ్యాన్స్‌తో పాటు ఇత‌ర నెటిజ‌న్లు కూడా తిట్టిపోసారు.

మ‌రోప‌క్క ఈ నెగిటివ్ క్యాంపెయిన్ వెన‌క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నార‌ని మ‌రికొంద‌రి వాద‌న‌. ద‌స‌రా సినిమాలో నాని లుక్‌.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ కాస్త ఒకేలా ఉన్నాయ‌ని, నాని ధ‌ర‌ణి క్యారెక్ట‌ర్ డామినేట్ చేసేలా ఉందని అందుకే ఈ చెడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు.. ద‌స‌రా ట్రైల‌ర్ రిలీజ్ అయిన‌ప్పుడు కూడా ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ ఆ సినిమాను నెగిటివ్‌గా చూపించిందని అంటున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ.. కొన్నిసార్లు ఫ్యాన్ వార్స్‌కి పాల్ప‌డేవారి కార‌ణంగానే ఈ నెగిటివ్ ప్ర‌చారాలు మొద‌ల‌వుతాయ‌ని గుర్తించాలి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఇత‌ర హీరోల‌ను వారి కుటుంబాల‌ను దారుణంగా తిడుతూ కామెంట్లు చేస్తుంటారు. ట్విట‌ర్‌లో ఈ ఫ్యాన్ వార్స్ మ‌రీ ఎక్కువ అయిపోతున్నాయి. కానీ తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్రం ఒక హీరోకి స‌క్సెస్ వ‌స్తే స‌పోర్ట్ చేయ‌డానికి అంద‌రూ ముందుంటారు. కాబ‌ట్టి.. ఇలాంటి రూమ‌ర్స్ న‌మ్మ‌క‌పోవ‌డ‌మే మంచిది.