మిస్డ్‌కాల్‌తో వీడిన మిస్టరీ.. దిల్లీలో సంచలన ఘటన

దేశ రాజధాని ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలిక కిడ్నాప్‌కు గురై ఆ తర్వాత హత్య గావించబడిన కేసును పోలీసులు ఓ మిస్డ్‌ కాల్‌ ఆధారంగా ఎట్టకేలకు ఛేదించారు. ఈ నెల 9వ తేదీ ఉదయం యథావిధిగా పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో తర్వాతి రోజు తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫోన్‌కి వచ్చిన మిస్డ్‌ కాల్‌తో నిందితుడు దొరికాడు..
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినప్పటికీ వారికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఈ క్రమంలో బాలిక తల్లికి కుమార్తె అదృశ్యమైన రోజున అంటే ఫిబ్రవరి 9న గుర్తు తెలియని నంబర్ నుంచి ఉదయం 11.50 గంటలకు మిస్డ్ కాల్ వచ్చింది. ఆమె తిరిగి ఆ నంబరును కాల్‌ చేయగా వెంటనే స్విచ్ఛాఫ్‌ రావడంతో ఇంక పట్టించుకోలేదు. బాలిక అదృశ్యం కావడంపై అనేక విధాలుగా విచారణ చేపడుతున్న పోలీసులు బాలిక తల్లి ఫోన్‌ నంబర్లను పరిశీలించారు. బాలిక కనిపించకుండా పోయిన రోజున మిస్డ్‌ కాల్‌ వచ్చిన నంబరుపై అనుమానంతో ట్రేస్‌ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సుమారు 12 రోజుల తర్వాత బాలికను కిడ్నాప్‌ చేసిన నిందితుడు రోహిత్ అలియాస్ వినోద్‌(21)ను మొబైల్ నంబర్‌ ద్వారా పోలీసులు ట్రాకింగ్‌ చేసి పంజాబ్, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల మధ్య అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. బాలికను తానే కిడ్నాప్‌ చేసి హత్య చేశానని వినోద్‌ చెప్పాడు. బాలిక శవాన్ని ఘెవ్రా మోర్ సమీపంలో పడేసినట్లు వెల్లడించాడు. దీంతో నిందితుడిని తీసుకుని వెళ్లి ముండ్‌కా గ్రామంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం..
ఎప్పటిలాగే ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కుమార్తె పాఠశాలకు బస్సులో వెళ్లినట్లు బాధితురాలి తల్లి పేర్కొన్నారు. సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో అనుమానంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశామని తెలిపారు. తనకు నలుగురు మగపిల్లలని, ఒక్కతే అమ్మాయని ఆమె వివరించారు. ఆ నలుగురు అన్నదమ్ములు చెల్లెలంటే ఎంతో ప్రేమగా ఉంటారని, తాము కూడా ఆప్యాయంగా చూసుకుంటామని.. తమ కుమార్తె ఇక లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బాలిక తల్లి భోరున విలపిస్తున్నారు.

పోస్టుమార్టం నివేదిక అనంతరం చర్యలు…
నిందితుడు వినోద్‌ను పోలీసులు బాలిక మృతదేహాన్ని పడేసిన ప్రదేశానికి తీసుకెళ్లి విచారించారు. పోలీసులతోపాటు సంఘటన స్థలాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని.. బాలికపై లైంగిక వేధింపులు జరిగాయా లేదా అనేది పోస్టుమార్టం నివేదిక ద్వారా నిర్ధారిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.