Exclusive: రేడియేష‌న్ భ‌యంతో ఉద్యోగం మానేసిన యువ‌కుడు…!

Hyderabad: పై ఫొటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు సూర్య‌తేజ‌ (suryateja). బీకామ్ చ‌దివాడు. మంచి క‌మ్యునికేష‌న్ స్కిల్స్ ఉన్నాయి. కానీ జాబ్స్ మాత్రం చేయ‌ను అంటున్నాడు. ఎందుకో తెలుసుకోవాలంటే అత‌ని క‌థ మీకు తెలియాల్సిందే (exclusive)

సూర్య కొన్నేళ్లుగా ఓ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నాడు. వైఫై రూట‌ర్ లేదా ఇత‌ర గ్యాడ్జెట్స్ నుంచి వెలువడే రేడియేష‌న్ వ‌ల్ల అత‌నికి చాలా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ట‌. 2014లో ఓసారి వైఫై రూట‌ర్ ద‌గ్గర కూర్చుని ఫోన్ మాట్లాడుతుంటే చెవుల్లో ఏదో పిన్నుతో గుచ్చిన‌ట్లుగా అనిపించింద‌ట‌. రూట‌ర్ నుంచి కాస్త దూరం రాగానే అలా ఏమీ అనిపించ‌లేద‌ట‌. అదీకాకుండా ఎప్పుడైతే రూట‌ర్‌కి ద‌గ్గ‌ర‌గా కూర్చున్నాడో అప్పుడు అత‌నికి విప‌రీతంగా త‌ల‌నొప్పి వ‌చ్చింద‌ని చెప్తున్నాడు. కానీ దానికి కార‌ణం రూట‌ర్ నుంచి వ‌స్తున్న రేడియేష‌న్ అని అప్ప‌టికి సూర్య‌కు తెలీదు. ఓసారి ఓ జాబ్‌లో జాయిన్ అయిన కొత్త‌లో కంప్యూట‌ర్ ముందు కూర్చుని వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు కూడా త‌ల‌తిరుగుతున్న‌ట్లు అనిపించేద‌ట‌.

అంతేకాదు.. ప‌క్క‌నే ఉన్న వేడి టీ క‌ప్పు ముట్టుకున్న‌ప్పుడు కూడా స్ప‌ర్శ తెలీలేద‌ని చెప్పాడు. ఇందుకు కార‌ణం ఏంటంటే అత‌ని చుట్టూ ఉన్న కంప్యూట‌ర్లు, ల్యాప్‌టాప్లు, వైఫై రూట‌ర్ ప‌వ‌ర్ బూస్టింగ్ కేబుల్స్‌. వాటి నుంచి వెలువ‌డే రేడియేష‌న్ వ‌ల్ల డైజెష‌న్ స‌మ‌స్య‌లు, నిద్ర‌ప‌ట్ట‌క‌పోవ‌డం, జుట్టు రాలిపోవ‌డం వంటివి జ‌రిగాయ‌ని ఎప్పుడైతే ఇంట్లోని రూట‌ర్ స్విచ్ ఆపేసి ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌కి దూరంగా ఉన్నానో అప్పుడు త‌న‌కు ఇలాంటి స‌మ‌స్య‌లు ఏవీ రాలేద‌ని చెప్తున్నాడు.

దీని గురించి ఇంకాస్త రీసెర్చ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. గ్యాడ్జెట్ల నుంచి వెలువ‌డే రేడియేష‌న్ వ‌ల్లే త‌న‌కు ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని క్లారిటీ రావ‌డంతో ఉద్యోగం మానేసాడు. త‌న ద‌గ్గ‌ర ఉన్న ఫోన్ కూడా 80% వాడ‌డు. ఏదో ఎమ‌ర్జెన్సీ అయితేనే ఫోన్‌ను స్పీక‌ర్‌లో పెట్టుకుని మాట్లాడుతుంటాడ‌ట‌. అది కూడా కేవ‌లం 15 నుంచి 20 నిమిషాలే. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. త‌న‌కు ఉద్యోగం చేసే ఉద్దేశం లేక‌పోయిన‌ప్ప‌టికీ ఖాళీగా ఉండేబ‌దులు ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నాడు. అలా ఆన్‌లైన్‌లో SAP నేర్చుకున్నాడు. మ‌రి ల్యాప్‌టాప్ ముందు పెట్టుకుని ఆన్‌లైన్‌లో క్లాసులు వింటే రేడియేష‌న్ ఎమిట్ అవుతుంది కాబ‌ట్టి.. త‌ల‌కు హెల్మెట్ పెట్టుకుని ల్యాప్‌టాప్ నుంచి కొన్ని అడుగులు దూరంగా కూర్చుని వినేవాడ‌ట‌.

ఈ గ్యాడ్జెట్ల నుంచి ఎమిట్ అయ్యే రేడియేష‌న్ వ‌ల్ల బ్రెయిన్ ట్యూమ‌ర్స్ కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుసుకున్న సూర్య‌కి భ‌యం రెట్టింపైంది. దాంతో ఏదేమైనా స‌రే ల్యాప్‌టాప్స్, వైఫైల‌తో ప‌నిలేకుండా ఉండే ఉద్యోగాల‌ను వెతుక్కోవాల‌నుకున్నాడు. అలా ఇప్పుడు అత‌ను రియ‌ల్ ఎస్టేట్‌లో దిగాడు. ఈ జాబ్‌లో అయితే కొద్దిసేపు స్పీక‌ర్‌లో పెట్టుకుని ఫోన్ మాట్లాడితే చాలు. సూర్య‌కు ఈ రేడియేష‌న్ భ‌యం ఎంత‌గా ప‌ట్టుకుందంటే.. ఓసారి త‌ను ల్యాప్‌టాప్స్ వాడే అవ‌స‌రం లేని ఉద్యోగం ఎక్క‌డైతే చేస్తున్నాడో.. ఆ కంపెనీ ఆఫీస్ పైన ఓ సెల్ ట‌వ‌ర్ పెట్టారు. దాని నుంచి రేడియేష‌న్ వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డి ఆ ఉద్యోగం మానేసాడు. ఇదే విష‌యాన్ని ఆ కంపెనీ మేనేజ‌ర్‌కు చెప్తే అత‌ను షాక‌య్యాడ‌ట‌.

అంతేకాదు.. ఇంటికి ద‌గ్గ‌ర్లో మీ సేవ సెంట‌ర్ ఉంద‌ని, కానీ అక్కడ కూడా సెల్ ట‌వ‌ర్ పెట్ట‌డంతో మీ సేవ‌లో ప‌ని ఉన్నా కూడా అటువైపు వెళ్లడంలేద‌ని చెప్తున్నాడు సూర్య‌. ఈ స‌మస్య అత‌నికి మాత్ర‌మే ఉంద‌ని అనుకుంటే పొర‌పాటేన‌ని, చాలా మందికి త‌లనొప్పులు వ‌చ్చేది గ్యాడ్జెట్లు, వైఫై ఎక్కువ‌గా వాడ‌టం వ‌ల్లేన‌ని అంటున్నాడు. కానీ ఇప్పుడున్న కాలంలో అవి లేకుండా ఉద్యోగాలు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి క‌నీసం అవ‌స‌రం లేని స‌మ‌యంలోనైనా వాటికి దూరంగా ఉంటే మంచిద‌ని మెసేజ్ ఇస్తున్నాడు. సూర్య స‌మ‌స్య తెలుసుకున్న అత‌ని త‌ల్లిదండ్రులు కూడా త‌మ బిడ్డ ఆరోగ్యంగా ఉంటే చాల‌ని అనుకుని ఏమీ అన‌డంలేద‌ట‌. ఒక‌వేళ ల్యాప్‌టాప్ ముందు కూర్చుని చేసే ఉద్యోగం త‌ప్ప వేరే ఆప్ష‌న్ ఏమీ లేక‌పోతే ఏం చేస్తావు అని అడిగితే.. ఎవ‌రైనా సాయం చేస్తే ఆర్గానిక్ కూర‌గాయ‌ల షాప్ పెట్టుకుంటాన‌ని చెప్తున్నాడు సూర్య‌.