కేతిరెడ్డి వర్సెస్ పరిటాల.. ధర్మవరంలో ఏం జరుగుతోంది?
గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో సామాజిక మాధ్యమాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అయితే ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధర్మవరంలో పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్‌తో కలిసి కేతిరెడ్డిపై అనేక ఆరోపణలు చేశారు. ప్రధానంగా కేతిరెడ్డి ధర్మవరంలోని ఎర్రగట్టు వద్ద నిర్మించుకున్న విలాసవంతమైన గెస్ట్‌హౌస్‌ని అక్కడి స్థలం ఆక్రమించి కట్టుకున్నారని నారా లోకేష్ ఆరోపించారు. ఇక దీనిపై స్పందించిన కేతిరెడ్డి… తాను ఎలాంటి అవినీతి కార్యకలాపాలకు, భూ కబ్జాలకు పాల్పడలేదని.. లోకేష్, కానీ ఆ పార్టీ నాయకులు ఎవరైనా ధర్మవరం వస్తే తన గెస్ట్ హౌస్ స్థలాన్ని సర్వే చేసుకోవాలని ఆయన ఛాలెంజ్ చేశారు. 24 గంటల్లో తాను అవినీతి చేసినట్లు లోకేష్ నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని… లేని పక్షంలో రాజకీయల నుంచి లోకేష్ తప్పుకుంటాడా అని కేతిరెడ్డి సవాల్ విసిరారు. ఇక కేతిరెడ్డి మాట్లాడిన మాటలకు పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇచ్చారు.
కొనసాగుతున్న మాటల యుద్దం..
కేతిరెడ్డి వర్సెస్ పరిటాల శ్రీరామ్‌ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్దం జరుగుతోంది. శ్రీరామ్ ఏమని ఆరోపణలు చేస్తున్నాడంటే.. రికార్డుల ప్రకారం.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం.. కేతిరెడ్డి తమ్ముడు భార్య గాలి వసుమతి పేరుతో కొన్నది కేవలం 25.38 ఎకరాలు మాత్రమే అని.. కానీ గుట్టపైన మొత్తం 45 ఎకరాలు ఆక్రమణలో ఉందన్నారు. మిగిలిన 20 ఎకరాలు మొత్తం కబ్జా చేశారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కేతిరెడ్డి ల్యాండ్ ను కొలవగా 45.47 ఎకరాలుగా చూపిస్తోంది. మిగిలిన 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందని లోకేష్, శ్రీరామ్ ప్రశ్నించారు. దమ్ముంటే అందరి సమక్షంలో ఎర్రగుట్టపై ఉన్న భూమిని కొలిపించే దమ్ము కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ఉందా అని లోకేష్ సవాల్ విసిరుతున్నారు. దీనిపై కేతిరెడ్డి ఏమన్నారంటే.. ఎర్రగుట్టపై సర్వే నంబర్లు 904, 905, 908, 909లో తన తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో రైతుల నుంచి భూములు కొన్నట్టు రికార్డులో ఉంది. మొత్తం రైతుల నుంచి 25.38 ఎకరాలు కొన్నట్టు రికార్డుల్లో ఉంది. అయితే ఇందులో 8 ఎకరాలు పిత్రార్జితంగా వచ్చినట్లు రికార్డులో ఉందని ఆయన చెబుతున్నారు. ఇక ఎర్రగుట్టపై మొత్తం 45.47 ఎకరాలు ఆక్రమించుకొని విలాసమంతమైన ఫామ్ హౌస్, తోటలు, బోటింగ్ లాంటివి కేతిరెడ్డి ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు రాగా.. వాటికి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఎర్రగుట్ట చుట్టూ నీరు ఉండి… మధ్యలో స్థలం ఉండటం నచ్చి.. దాన్ని అధికారికంగానే రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు కేతిరెడ్డి చెబుతున్నారు.
మరోవైపు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సంచలన టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పది ఎకరాలతో మొదలై ఇప్పుడు 100 నుంచి 150 ఎకరాల భూములు కేతిరెడ్డి ఎలా సంపాదించారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కాదు.. పెద్దగా వ్యాపారం లేదు.. ఏ పనీ లేదు అలాంటి వ్యక్తి వందల ఎకరాలు, ఆస్తులు ఎలా సంపాదించారన్నారని ప్రశ్నించారు. మరదలు, తమ్ముడి పేరుతో బినామీ ఆస్తులను పెంచుకుంటున్నారని కేతిరెడ్డిపై పరిటాల మండిపడ్డారు. కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు ఇంటిని చూపించి.. దీన్ని చంద్రబాబు ఆక్రమించారు అనడం విడ్డూరంగా ఉందని శ్రీరామ్ తెలిపారు. అది అద్దె ఇళ్లు అని… దాన్ని గెస్టు హౌస్‌గా నిర్మిస్తున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి అనుమతులు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. కబ్జాల చేసే నీకు.. తమ నాయకుడు చంద్రబాబుకు ఎంతో వ్యత్యాసం ఉందని కౌంటర్ ఇచ్చారు. త్వరలో ధర్మవరంలో జరుగుతున్న భూముల కబ్జాలపై సిట్ దర్యాప్తు ఉంటుందని దానికి సిద్దంగా ఉండాలని శ్రీరామ్ సవాల్ విసిరారు.