JDS: కర్నాటకలో గేమ్ ఛేంజర్!
కర్నాటక రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలు లింగాయత్‌లు, వొక్కళిగలు.. ఈ రెండు కులాలు కలిపి దాదాపు 30 నుంచి 35 శాతం వరకు ఉంటారు. ఆ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా గెలుపుని శాసించేది మాత్రం ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులే. మరో నెల రోజుల్లో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జాతీయ పార్టీలు, అదేవిధంగా ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. ఈక్రమంలో అక్కడ గత కొంతకాలంగా ప్రజాధరణ పొందుతూ.. కింగ్ మేకర్‌గా ఉన్న పార్టీ జేడీఎస్(సెక్యూలర్). హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని ఆ పార్టీ.. అటు కాంగ్రెస్, బీజేపీలకు చెమటలు పట్టిస్తోంది. దీనికి ప్రధాన కారణం జేడీఎస్ కర్నాటకలో గెలిచేంత స్థానాలు తెచ్చుకోలేకపోయినా.. ఇతరుల విజయాలకు మాత్రం గండికొడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఏ ప్రాంతంలో ఏ పార్టీకి నష్టం వాటిల్లుతుందో తెలియని పరిస్థితి జాతీయ పార్టీల్లో నెలకొంది. ఇక ఇప్పటికే జేడీఎస్‌తో జతకట్టేందుకు ఎంఐఎం సుముఖత వ్యక్తం చేయడంతో.. ముస్లిం ఓటర్లను సైతం తమవైపు తిప్పుకునే పనిలో కుమారస్వామి పావులు కదుపుతున్నారు.
జేడీఎస్ ప్రభావితం చేసే నియోజకవర్గాలు ఇలా..
కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే మొత్తం స్థానాల్లో పోటీ చేసే బలం జేడీఎస్‌కు లేదు. కానీ సుమారు 60 స్థానాల్లో ఆ పార్టీ బలంగా ఉంది. మరో 50 నుంచి 60 స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరి నష్టం వాటిల్లుతుందో ఆయా పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇక వొక్కళిగ సామాజిక వర్గం, ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో జేడీఎస్ బలంగా ఉంది. దీంతోపాటు ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వడంతో… ఈ సారి ముస్లిం ఓటర్లు జేడీఎస్ వైపు మళ్లే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను తొలగించింది. కాంగ్రెస్ మాత్రం తమను అధికారంలోకి తీసుకొస్తే.. మళ్లీ ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని అంటోంది. ఈక్రమంలో ఈ రెండు పార్టీలను ముస్లింలు నమ్ముతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గతంలో జేడీఎస్‌కు వచ్చిన సీట్లు ఎన్నంటే….
వాస్తవానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి రాకుండా జేడీఎస్ అడ్డుగా ఉందని ఘంటాపథంగా చెప్పవచ్చు. 2018 ఎన్నికల్లో హంగ్ సభ ఏర్పడగా,,, అప్పట్లో బీజేపీ 104 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్‌కు 80 సీట్లు రాగా.. జేడీఎస్ 37 సీట్లలో గెలుపొందింది. దీంతో ఈ రెండు పార్టీలూ చేతులు కలిపి జేడీఎస్ నేత కుమారస్వామి సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజా పరిస్థితికి వస్తే జేడీఎస్ ఎంత లేదన్నా 60 స్థానాల్లో బలంగా ఉంది. 59 స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల సామర్థ్యం కూడా ఉంది. ప్రధాన పార్టీలు సొంతగా మెజారిటీ సాధించడానికి ఇదే అడ్డుగా ఉంది. జేడీఎస్ ఉనికిలో లేకపోతే కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీగా తలపడతాయని.. అప్పుడు బీజేపీకే అధిక విజయావకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి కాంగ్రెస్ సొంతగా మెజారిటీ మార్కు (113 సీట్లు) సాధించాలంటే కనీసం 42 శాతం ఓట్లయినా సాధించగలగాలని.. ఇది జరగాలంటే జేడీఎస్ బాగా బలహీనపడాలని విశ్లేషకులు అంటున్నారు.
కర్ణాటకలో త్రిముఖ పోటీ కారణంగానే హంగ్ సభ ఏర్పడుతోంది. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీ తప్పనిపరి పరిస్థితుల్లో జేడీఎస్‌తో ఎన్నికల అనంతరం పొత్తు కుదుర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తోంది. 2004 నుంచి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో 176 స్థానాల్లో కాంగ్రెస్-బీజేపీ-జేడీఎస్ మధ్య త్రిముఖ పోటీ జరిగింది. బీజేపీ 79, కాంగ్రెస్ 65, జేడీఎస్ 58 స్థానాల్లో విజయం సాధించాయి. ధరంసింగ్ నేతృత్వంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2008లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అప్పుడు 154 స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ 110, కాంగ్రెస్ 80, జేడీఎస్ 28 సీట్లు సాధించాయి. ఆరుగురు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ తొలిసారి రాష్ట్రంలో సొంతగా అధికార పగ్గాలు చేపట్టింది. 2013 నాటికి జేడీఎస్ కొన్ని ప్రాంతాల్లో బాగా బలహీనపడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో మాత్రమే త్రిముఖ పోటీ ఉంది. 2018 ఎన్నికల్లో త్రిముఖ పోటీతో హంగ్ ఏర్పడింది. ఇప్పుడు, వొక్కళిగ సామాజిక వర్గం, ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లో జేడీఎస్ బలంగా ఉంది. ఎంఐఎం మద్దతుతో కింగ్‌మేకర్‌గా మారాలని పట్టుదలతో ఉంది. మరోవైపు, 115 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. అయితే ఈ స్థానాల్లో జేడీఎస్ ఓట్లు ఏ మాత్రం పెరిగినా కాంగ్రెస్‌కు దెబ్బేనని విశ్లేషకుల అంచనా. దక్షిణ కర్ణాటకలో బీజేపీకి బలమెక్కువ. ఇక్కడ జేడీఎస్ బలంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి తనకు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఉత్తర, మధ్య కర్ణాటకల్లో జేడీఎస్ ఉనికి తక్కువ. కానీ ఆ పార్టీ కాంగ్రెస్ ఓట్లకు ఇక్కడ గండికొడుతోంది. కనీసం 5 శాతం ఓట్లను అధికంగా పొందినా.. కాంగ్రెస్ ఆశలు గల్లంతవుతాయి. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలు ప్రభావితమయ్యే అవకాశమూ ఉంది. దీంతో ఎమ్మెల్యేల గెలుపోటములతోపాటు, అధికారంలో ఎవరు ఉండాలి అన్నది నిర్ణయించేది.. జేడీఎస్.. అని రానున్న ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అని విశ్లేషకులు చెబుతున్నారు.