ఈ ప్రదేశాల్లో చీకటి పడదు!
ఈ విశ్వంలో భూమి ఒక్కటే జీవం ఉన్న ఏకైక గ్రహం. భూమిపై మన ఊహకు కూడా అందని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. సైన్స్‌కి అందని ఎన్నో సంగతుల సమాహారం ఈ సృష్టి. భూమి నిరంతరం సూర్యుని చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను భ్రమిస్తూ ఉంటుందని తెలిసిందే. దీని వల్లే మనకు రాత్రి, పగలు ఏర్పడతాయి. ఇది భూమి పై సాధారణంగా ఉండే దినచర్య. కానీ అసలు సూర్యుడు అస్తమించిన ప్రదేశాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా! అవును.. వినడానికి వింతగా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు ఇరవై నాలుగు గంటలూ ప్రకాశిస్తూనే ఉంటాడు. అంటే.. అక్కడ అసలు రాత్రి అనే మాటే ఉండదన్నమాట. మరికొన్ని ప్రాంతాల్లో కొన్నిరోజులు, నెలలపాటు సూర్యుడు అస్తమించడు. కొన్ని ప్రాంతాల్లో రోజులో కొన్ని గంటలు మాత్రమే సూర్యుడు ప్రకాశిస్తాడు. అంటే ఈ భూమ్మీద అన్ని చోట్లా పగలు, రాత్రి సమానంగా ఉండవన్నమాట. భూమ్మీద అస్సలు చీకటి ప్రాంతాలేవో తెలుసుకుందాం..
నార్వే
ఆర్కిటిక్ ఖండంలోని ఉన్న ఓ దేశం నార్వే, దీనినే ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్ అంటారు. అంటే అర్థరాత్రి సూర్యుడు ప్రకాశించే నెల అని అర్థం. మరి పేరుకు తగ్గట్టే ఈ దేశంలో మే నుండి జూలై చివరి వరకు అనగా సుమారు 76 రోజుల పాటు ఇక్కడ సూర్యుడు అస్తమించడు. ఈ ప్రాంతం మొత్తం సాధారణంగా నే సూర్యుడు రోజులో 20 గంటలు ప్రకాశిస్తాడు.. నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో అనే ప్రాంతంలో అయితే, ఏప్రిల్ 10 నుండి ఆగస్టు 23 వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తునే ఉండటం మరో అద్భుతం. రాత్రి లేని రోజులను గడపాలనుకుంటే ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఐస్‌లాండ్
ఆర్కిటిక్ ఖండలోని మరొక దేశం ఐస్లాండ్. గ్రేట్ బ్రిటన్ తర్వాత యూరప్‌లో అతిపెద్ద ద్వీప దేశమే ఈ ఐస్లాండ్.
ఐస్లాండ్ లో అయితే, మే 10 నుండి జూలై వరకు నిరంతర సూర్యరశ్మి ని పొందవచ్చు. ఇక్కడ సూర్యుడు అన్ని వేళల్లో పొద్దు పొడిచే రేఖ వద్దే కనిపిస్తాడు.
కెనడా
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద దేశం, కెనడాలోని అనేక ప్రాంతాలు ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటాయి. ఇనువిక్ మరియు వాయువ్య భూభాగాలలో, వేసవిలో సుమారు 50 రోజుల పాటు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తాడు.
అలాస్కా
సూర్యుడు అస్తమించని ప్రదేశాల్లో తర్వాత చెప్పుకోవాల్సిన ప్రాంతం అలాస్కా, ఈ దేశంలో మే చివరి నుంచి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించడు. అందమైన హిమానీనదాలు మరియు మంచుతో కప్పబడిన పర్వతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి; తెల్లవారుజామున 2 గంటలకు ఆ అందమైన పర్వతాలు మంచుతో మెరిసిపోతుండటం మీరు ఇక్కడ చూడవచ్చు.
స్వీడన్
సూర్యుడు అస్తమించని ఇతర దేశాలతో పోలిస్తే సాధారణంగా ఈ దేశం వేడిగా ఉంటుంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు నెల నెల కు భారీగా మారిపోతుంటాయి. స్వీడన్‌లో సాధారణంగా మే ప్రారంభం నుండి ఆగస్టు చివరి వరకు సూర్యుడు అర్ధరాత్రి అస్తమించి, ఉదయం 4:30 గంటలకు మళ్లీ ఉదయిస్తాడు.అంటే రోజులో చాలా వరకు సూర్య కాంతి ఉంటుంది. జనవరలో అయితే చాలా వరకు చీకటే ఉంటుంది. స్వీడన్ కి మీరు జూన్ లో వెళ్ళినట్లైతే ఆ సమయంలో నిరంతరం సూర్య కాంతి ఉంటుంది.
ఫిన్లాండ్
వేల సరస్సులు, ద్వీపాల భూమి ఫిన్లాండ్. ఈ దేశం లోని చాలా ప్రాంతాలు వేసవిలో 73 రోజుల పాటు చీకటిని చూడవు. ఉత్తర ధృవ జ్యోతుల కాంతులు ఈ దేశంలో మనకు ప్రత్యేకంగా దర్శనమిస్తాయి.
ఇవే కాకుండా రష్యా వంటి కొన్ని దేశాల్లో కూడా ఈ విధంగా అర్థరాత్రి సూర్యుడు కనిపించే ప్రాంతాలు ఉన్నాయి. ఏది ఏమైనా మనం నివసిస్తున్న భూమి పై మన ఊహకి అందని అద్భుతాలు చాలా ఉన్నాయి మరి!