మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 2 వేలు దాటిన యాక్టివ్ కేసులు
కరోనా వైరస్ రెండు సంవత్సరాలపాటు ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కుదిపేసింది. ప్రతి రంగం కరోనా కారణంగా అతలాకుతలమైంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, కొందరు ఇప్పటికీ కరోనా అనంతర ప్రభావంతో బాధపడుతున్నారు. లాక్డౌన్, వ్యాక్సీన్లు, జాగ్రత్తల కారణంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ రోజు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖా సమాచారం ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,090కి చేరింది.
పోయినేడాది చివరి నుంచే ఇండియాలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి. వీటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, హాస్పిటాలిటీ, టూరిజం, రియల్ ఎస్టేట్, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్లు తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు చూస్తున్నాయి. అంతేకాదు చైనాలోనూ కరోనా ఫోర్త్ వేవ్ తిరిగి ప్రారంభమై కేసులు పెరగడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. కొత్త వేరియంట్ BF.7 అవుట్ బ్రేక్‌తో పలుదేశాలు అప్రమత్తమయ్యాయి.
కరోనా విజృంభణపై టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ నెట్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ అన్షుమాన్ దాస్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావంతో హాస్పిటలిటీ, ట్రావెలింగ్, టూరిజం, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, కమర్షియల్ రంగాలు హై అలర్ట్ ప్రకటించాయని తెలిపారు. చైనాతో పాటు ఇతర విదేశాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవడంతో ప్రధాని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఈ ప్రాణాంతక వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గయా ఎయిర్ పోర్టులో విదేశాల నుంచి వచ్చిన నలుగురు భారతీయులు కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ నలుగురిని ఐసోలేషన్‌కి తరలించినట్లుగా అధికారులు తెలిపారు.
దేశంలో ఇప్పటివరకు 4.46 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మొత్తం 5,30,764 మరణాలు నమోదయ్యాయి. ప్రతిరోజు పెరిగే కేసుల సంఖ్య 0.56 శాతంగా ఉంది. వారంలో కేసుల సంఖ్య 0.16 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
కరోనా భారి నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తరుణంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. తెలంగాణలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెలలో అయిదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాలామంది జలుబు, గొంతునొప్పి, ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతూ కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు చేసిన తర్వాతనే దేశంలోకి అనుమతిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.