Tirumala: తిరుమలలో పూలెందుకు పెట్టుకోకూడదు?
Tirumala: తిరుమలలో ఎవ్వరూ పువ్వులు ధరించకూడదు అన్న నియమం ఉంది. అలా ఎందుకో ఏ కారణం వల్ల ఈ నియమం పెట్టారో తెలుసుకుందాం. తిరుమలకు పుష్ప మండపం అనే మరో పేరుంది. అక్కడి పువ్వులన్నీ శ్రీవారికే చెందాలి. అయితే.. ఆ క్షేత్రంలో ఉన్నప్పుడు ఎందుకు పువ్వులు పెట్టుకోకూడదు అని ఎందుకు అంటారంటే.. దీని వెనుక ప్రచారంలో ఓ కథ ఉంది. పూర్వం స్వామి వారికి అలంకరించిన పువ్వులను భక్తులకు ఇచ్చేవారు. ఓసారి శ్రీశైలపూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామి వారికి సమర్పించాలని పువ్వులను తాను ధరించాడు. ఈ విషయం శ్రీశైలపూర్ణుడుకి తెలీదు. అతను ఎప్పుడైతే పువ్వులు పెట్టుకున్నాడో అదే రోజు రాత్రి శ్రీశైలపూర్ణుడికి కలలో స్వామి వారు కనిపించారు.
కనిపించి.. నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేసాడు అని చెప్పారు. అది విని శ్రీశైలపూర్ణుడు ఎంతో బాధపడ్డాడు. అప్పట్లో దేవాదాయ శాఖలు ఉండేవి కావు. ఆలయానికి, శ్రీవారికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రధాన అర్చకులు చెప్పిందే రూల్‌గా ఉండేది. అలా తిరుమలకు వచ్చేవారు ఎవ్వరూ కూడా పువ్వులు ధరించకూడదు అన్న నియమాన్ని పెట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ నియమాన్ని భక్తులు ఆచరిస్తూ వస్తున్నారు. అందుకే స్వామివారికి అలంకరించిన పువ్వులను బావిలో వేయాలనే ఆచారం మొదలైంది. భగవంతుడి ముందు భక్తులు అతి సాధారణంగా ఉండాలన్నది ఇక్కడ అసలు నియమం. అందుకే ఆలయాలకు వెళ్లినప్పుడు టిప్ టాప్‌గా రెడీ అయ్యి వెళ్లకూడదు. సాత్విక భావనతో సాత్వికమైన దుస్తులను ధరించి వెళ్లాలి.