ప్రపంచలోనే ఎత్తైన రైల్వే వంతెన.. మన దేశంలోనే!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి త్వరలోనే జమ్ము కశ్మీర్ లో ప్రారంభం కానుంది. చీనాబ్‌ నదిపై దాదాపు 359 మీటర్లు అంటే 1,178 ఫీట్ల ఎత్తులో… బక్కాల్, కౌరి ప్రాంతాల మధ్య ఈ వంతెనను నిర్మించారు. ప్యారీస్ లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన ఎత్తు 35 మీటర్లు ఎక్కువ. ఉదంపూర్, శ్రీనగర్, బరముల్లా ప్రాంతాల రైల్వే అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ.35 వేల కోట్లతో దీన్ని నిర్మించారు. ఇటీవలే ఈ వంతెన హై వెలాసిటీ విండ్, హై టెంపరేచర్, స్థిరత్వం, భద్రత లాంటి పరీక్షలన్నింటినీ క్లీయర్ చేసింది. ఇప్పుడు దాదాపు అన్ని పనులు పూర్తి కావస్తుండటంతో తొందర్లోనే ఈ వంతెనపై రైళ్లు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి.

వాస్తవానికి ఈ వంతెన నిర్మించేందుకు 2003లోనే అనుమతి వచ్చింది. 2004 లో పనులు పారంభమయ్యాయి. కానీ 2008లో ఆ వంతెన స్థిరత్వం, భద్రత పట్ల అనుమానాలు, భయాలు రావడంతో కొంతకాలంపాటు ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభించారు. కానీ అనేక సవాళ్లు ఎదురుకావడం వల్ల పనులు నెమ్మదిగా సాగాయి. జమ్ము కశ్మీర్ ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ వంతెన కోసం ఎదురుచూస్తున్నారు. చివరికీ ఇప్పుడు అన్ని పనలు పూర్తి కావడంతో తొందర్లోనే ఈ వంతెనను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఆ వంతెనను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ఈ వంతెనపై రేపు ఇంకో రెండు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని… అవి పూర్తైతే తొందర్లోనే ఈ వంతెన ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే ఈ వంతెన దాదాపు 260 kmph వేగంతో వచ్చే గాలిని కూడా తట్టుకుంటుందని.. దాదాపు 120 ఏళ్ల పాటు ఈ బ్రిడ్జి స్థిరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.