ఈ రామాల‌యాల‌ను ద‌ర్శించి తీరాల్సిందే!

మనదేశంలో ప్రతి ఊరిలో ఓ బడి ఉన్నట్టే ఓ రామాలయం కూడా తప్పక ఉంటుంది. అంతటి సుప్రసిద్ద దేవుడు శ్రీరాముడు. హిందూ దేవుళ్లలో రాముడిది ప్రత్యేక స్థానం. విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటైన రామావతారం తేత్రాయుగంలో ఈ భూమ్మీద మానవ రూపంలో జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా భారత దేశంలోని సుప్రసిద్ద రామాలయాల్లో కొన్ని ఆలయాల గురించి తెలుసుకుందాం..

కాలారామ్ ఆలయం, మహారాష్ట్ర

ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయంలో కొలువైన నలుపు రంగు రాముడి విగ్రహం కారణంగా ఈ పేరు వచ్చింది. ఈ ఆలయం రాముడు వనవాస సమయంలో నివసించిన ప్రదేశాలలో ఒకటిగా నమ్ముతారు. దీనిని 1782లో పాత చెక్క దేవాలయం ఉన్న స్థలంలో సర్దార్ రంగారావు ఒధేకర్ నిర్మించారు. ఇది పశ్చిమ భారతదేశంలోని అత్యుత్తమ ఆధునిక దేవాలయాలలో ఒకటి.

రఘునాథ్ ఆలయం, జమ్మూ & కాశ్మీర్

ఇది జమ్మూలో ఉన్న రామాలయం. ఇది ఏడు హిందూ పుణ్యక్షేత్రాల సముదాయాన్ని కలిగి ఉంది. ఈ ప్రత్యేక ఆలయంలో చాలామంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు. అయితే ప్రధాన మూర్తి మాత్రం విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అయిన రాముడు. ఆలయం లోపలి గోడలు మూడు వైపులా బంగారు రేకులతో కప్పబడి ఉంటాయి. ఆలయం లోపల శివలింగాలు, సాలిగ్రామాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి.

రాజా రామ్ ఆలయం, మధ్యప్రదేశ్

ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉంది. రాముడు భక్తులచే రాజుగా పూజించబడే ఏకైక ఆలయం. రాముడు ఆలయం లోపల సీతా దేవితో పాటు సోదరుడు లక్ష్మణుడు, మహారాజ్ సుగ్రీవుడు, నర్సింహ భగవాన్‌లతో కలిసి కొలువైనాడు.

రామస్వామి ఆలయం, తమిళనాడు

కుంభకోణంలోని ఇది భారతదేశంలోని ప్రముఖ రామాలయం. దీనిని 15వ శతాబ్దంలో విజయనగర రాజు నిర్మించారు. ఈ ఆలయం కేవలం గర్భగుడి, స్తంభాల హాలు, అర్ధ మండపం మాత్రమే కలిగి ఉంటుంది. రామస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని అయోధ్యగా ప్రసిద్ధి చెందింది. భరత, శత్రుఘ్నులతో పాటు రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలను దర్శించుకోగలిగే చూడగలిగే ఏకైక ఆలయం.