మగవాళ్లు.. మగువలయ్యారు: క‌ర్నూలులో వింత ఆచారం!

హోలీ పండుగ రోజు సాధారణంగా అందరూ ఏం చేస్తారు.. వివిధ రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ కేరింతలు కొడతారు. కానీ ఇక్కడ మాత్రం మగవాళ్లు మగువలుగా మారిపోతారు. అవును.. అచ్చం అమ్మాయిలాగే చీర, గాజులు, బొట్టు పెట్టుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అసలు దేనికోసం మగవాళ్లు.. ఆడవాళ్లుగా మారతారు… ఏమని పూజలు చేస్తారు.. ఆ గ్రామం ఎక్కడుంది? అనే విషయాలు తెలుసుకుందామా..

మహిళలో మగవారికి చీర కడతారు..
కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం సంతకుందులూరు గ్రామంలో హోలీ పండుగ సందర్బంగా మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారతారు. ఈ తంతు రెండు రోజుల పాటు జరుగుతుంది. ఆ రోజు అక్కడ అచ్చం జంబలకిడి పంబ సినిమా చూసినట్టు ఉంటుంది. ఇలా విచిత్రమైన ఆచారంతో అక్కడివారు హోలీ పండుగ చేసుకుంటారు. చక్కగా చీర, గాజులు, బొట్టు పెట్టుకుని పదహారణాల పడుచులా మగవారు అందంగా తయారవుతారు. ఈ అలంకరణలో మగవారి భార్యలు సహాకారం పూర్తిగా ఉంటుంది. వారే దగ్గరుండి చీర కట్టడం వంటివి చేస్తారు. అనంతరం మహిళలందరూ కలిసి పురుషులను ఆలయానికి తీసుకెళ్తారు.

రతీ మన్మథులకు మగవాళ్ల పూజలు..

హోలీ పండుగ రోజున పురుషులంతా ఆడవాళ్ళ వేషధారణలో గ్రామంలోని భసవేశ్వరస్వామి ఆలయంలో ఉన్న రతీ మన్మధులను పూజిస్తారు. ఇలా పూజలు చేయడం వల్ల సంతానం కలుగుతుందని, ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోతాయని అక్కడి ఆచారంగా చెబుతారు. స్త్రీల మాదిరిగా పురుషులంతా చీరలు కట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని, చక్కగా అలంకరించుకొని అచ్చం అమ్మాయిల మాదిరిగా రెడీ కావడం అనేది దాదాపు 300 వందల సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని గ్రామస్థులు అంటున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పంటలు బాగా పండటానికి, గ్రామంలోని ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండడానికి పురుషులు ఆడవాళ్ళ వేషధారణ వేసి పూజలు చేయడం ఆనవాయితీ అని వారు అంటున్నారు.

ఆచారాన్ని చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి రాక..

ఇక ఇక్కడ వారి ఈ విచిత్ర సంప్రదాయాన్ని, ఉత్సవాలను చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా, ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళల వేషధారణలో దేవుడిని పూజిస్తారని వారు అంటున్నారు. ఇది ఇక్కడి వారి తరతరాల సంప్రదాయమని అంటున్నారు. ఈ పండుగను రెండు రోజులపాటు జరుపుకుంటారని.. ఏటా ఈ పండుగను ఎంతో స్సెషల్‌గా జరుపుకుంటామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.