హోళీ ఆడుతున్నారా.. ఇవి పాటిస్తే మీరు సేఫ్‌

సప్తవర్ణాల కేళి.. రంగుల హోళీ. చిన్నా,పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ కలసి సంబరంగా చేసుకునే వేడుక. అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండగ జరుపుకుంటారు. అయితే ఈ వేడుక సంబరం సరదాగానే ఉంటుంది కానీ తర్వాత ఎదురయ్యే సమస్యలే ఇబ్బందికరంగా మారతాయి. ఈ వేడుకల్లో వాడే రంగుల గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలు కలిపిన రంగుల వల్ల చర్మ సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశం ఎక్కువ. హోళీ రోజున తీసుకోవలసిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..

* మన శరీరంలో కళ్లు అత్యంత సున్నితమైన అవయవాలు. రంగులు చల్లుకునేప్పుడు కళ్లలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి చికాకు, అలెర్జీలు, తాత్కాలిక అంధత్వం కూడా సంభవించవించే ప్రమాదం ఉంది. సహజంగా తయారు చేసిన రంగులు వాడటం మంచిది. కానీ, ఈ మధ్య రంగులు తయారు చేయడానికి రకరకాల కెమికల్స్‌ వాడుతున్నారు. మెర్కురీ, ఆస్బెస్టాస్, సిలికా, మైకా, సీసం వంటి ప్రమాదకరమైన పదార్ధాలతో రంగులు తయారు చేస్తున్నారు. ఈ రంగులు కంటిలో పడితే.. కళ్లు దెబ్బతినే అవకాశం ఎక్కువ. అందువల్ల రంగులు కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం మంచిది.
* హోళీకి ఒకరోజు ముందు ఒళ్లంతా ఆవ నూనె పూసుకోవాలి. ముఖం, మెడ, కాళ్లు, చేతులు మొదలైన హోళీ రంగులు అంటుకునే ప్రదేశాలకు నూనె పూసుకోవాలి. ఆవ నూనె రంగులు అంటుకోకుండా చర్మానికి రక్షణ కవచంలా పని చేయడంతో పాటు రంగులను తేలికగా వదిలించేటందుకు తోడ్పడుతుంది.
* వెంట్రుకలకు కొబ్బరి నూనె పూసుకోవాలి. కొబ్బరి నూనె రంగులు కుదుళ్లలోకి ఇంకిపోకుండా కాపాడుతుంది. ప్రత్యామ్నాయంగా లోషన్‌ కూడా వాడవచ్చు. దీంతో కూడా రంగులు అంటుకుపోకుండా ఉంటాయి. వాటిని వదిలించడమూ తేలికవుతుంది.
* ముఖ్యంగా పిల్లలతో హోళీ ఆడుతున్నప్పుడు సింథటిక్ రంగులను ఉపయోగించవద్దు. ప్రస్తుతం మార్కెట్లో సహజ సిద్ధమైన రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కంటికి ఎలాంటి హాని కలిగించవు. వీటిని ఇంట్లోనూ స్వయంగా తయారు చేసుకోవచ్చు.
* రంగులు చల్లుకునేటప్పుడు మెటల్ స్ప్రింక్లర్లు, పదునుగా ఉన్న పిచికారీలు ఉపయోగించవద్దు. జుట్టుపై పడకుండా జాగ్రత్తపడాలి. జుట్టును బ్యాండ్‌తో టై చేయడం మేలు, జడ వేసుకుంటే ఇంకా మంచిది. రంగు నీళ్లు కళ్లలోకి కారకుండా ఉండటానికి తలకు టోపీ పెట్టుకోండి.
* కాంటాక్ట్‌ లెన్స్‌ వాడేవాళ్లు వాటితోనే హోళీ ఆడొద్దు. రంగు కళ్లు, లెన్స్‌ మధ్య ఇరుక్కుని ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే అవకాశం ఎక్కువ. రంగులు పూసుకున్న చేతులతో ఎట్టిపరిస్థితుల్లో కళ్లను తాకవద్దు. శుభ్రంగా కడిగిన తర్వాతే కళ్లను తాకాలి.
* కళ్లలో రంగులు పడితే నులుమకుండా చల్లని నీటితో కడగాలి. కళ్లమంట, దురద ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా వీలైనంత త్వరగా డాక్టర్​ను సంప్రదించాలి. ఆలస్యమైతే దృష్టిలోపాలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో చూపు కూడా కోల్పోవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుని హోళీ సంబరాలు చేసుకోవడం మంచిది.