కుమారస్వామీ సుబ్రహ్మణ్య స్వామీ ఒకరేనా?
అసలు వీరిద్దరికీ సంబంధం ఏంటి? పిల్లలు లేని వారు సాధారణంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తుంటారు. సుబ్రహ్మణ్య ఆరాధనకు ఈ పిల్లలకి మధ్య ఉన్న సంబంధమేంటి? సుబ్రహ్మణ్య ఆరాధనని మనం మూడు రకాలుగా చేయచ్చు. మొట్ట మొదటి స్వరూపం ఏంటంటే.. కార్తికేయుడు, షణ్ముఖుడు. అంటే స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి. దీని అర్థం ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థం.
ఆ స్వరూపాన్ని మనలాంటి వారు పూజిస్తే అప్పుడు మనకి కూడా జ్ఞానం ప్రసాదిస్తాడు. రెండోది ఏంటంటే.. స్వామినే సర్ప స్వరూపంగా ఆరాధిస్తాం. ఆయన్నే సుబ్రహ్మణ్యస్వామి అంటారు. మరి కుమార స్వామి సర్పానికి సంబంధం ఏంటంటే.. దీని వెనక ఓ చిన్న కథ ఉంది. అదేంటంటే.. ఒకసారి స్వామి కైలాశంలో అమ్మవారి ఒడిలో కూర్చుని ఉన్నప్పుడు.. శివుడిని చూడటానికి వచ్చినవారికి చూస్తూ కూర్చున్నాడు.
ఈలోగా దేవతలు చక్కగా మెరిసిపోయే దుస్తులు వేసుకొచ్చారు. వారిని సుబ్రహ్మణ్యస్వామి అలాగే వీక్షిస్తున్నారు. ఈలోగా కైలాశానికి సనకసనంధనాథులు వచ్చారు. బ్రహ్మ మానస పుత్రులు అన్నమాట. వారు దిగంబరులు. వారి శరీరంపై స్పృహ ఉండదు. దాంతో వారు వచ్చేసరికి స్వామి చూసి వాళ్లను అవహేళనగా నవ్వారు. ఆ తర్వాత పార్వతి మందలించి నాయనా అలా చేయకూడదు అంది.
దీనికి ప్రాయశ్చితం చేసుకోవాల్సిందే అని చెప్పింది. చివరికి స్వామి ఏం చేసారంటే.. తప్పు చేసాక ప్రాయశ్చితం చేసుకోవడానికి సర్పరూపాన్ని తీసుకుని ముళ్ల నుంచి రాళ్ల నుంచి పుట్టల నుంచి నడుచుకుంటూ వెళ్లాడట. తర్వాత ఒక చోటకి వెళ్లి ఒక పుట్టలో 60 ఏళ్ల పాటు తపస్సు చేసాడట. ఆ ప్రదేశమే మోహినీపురం. ఈ మోహినీపురం ప్రాంతాన్నే ఇప్పుడు మోపిదేవి అని పిలుస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవే ఈ మోహినీపురం. చాలా శక్తిమంతమైన ప్రదేశం అది.
అలా స్వామి తపస్సు చేస్తున్నప్పుడు పాకే ప్రాణులకు అధి దేవత అయ్యాడు. అంటే చిన్న పురుగు నుంచి పెద్ద అనకొండ వరకు ప్రతీ పాకే ప్రాణిలోనూ షణ్ముఖుడు ఉండేలా అధిదేవత అయ్యాడు. అక్కడి నుంచి వచ్చింది ఈ పాములకు కుమారస్వామికి సంబంధం. అందుకు సుబ్రహ్మణ్య ఆరాధన చేసేవారు నూడుల్స్, సేమ్యా వంటివి కూడా తినరు. ఎందుకంటే అలాంటివి తినడం అనే ఊహను కూడా వారు భరించలేరన్నమాట.
ఇప్పుడు కుమారస్వామికి సుబ్రహ్మణ్యస్వామికి సంబంధం ఏంటో తెలిసింది కదా. మరి దీనికి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏంటి అంటే.. పాకే వాటన్నింటికీ సుబ్రహ్మణ్య అధిదేవత అయ్యాడు కాబట్టి.. పురుషుడి వీర్యకణాలను మైక్రోస్కోప్‌లో చూస్తే పాముల్లా పాకే జంతువులు కొన్ని వేలల్లో ఉంటాయి. వాటన్నింటికి కూడా స్వామే అధిదేవత అని భావిస్తారు. అందుకే వీర్యానికి సంబంధించిన సమస్యలు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే వెంటనే పిల్లలు పుడతారు అని పెద్దలు చెప్తుంటారు.
ఇక మూడో స్వరూపం ఏంటంటే.. మనలో ఉన్న కుండలిని నిషిత్తి. ఇది ప్రతివారిలోనూ నిద్రాణంగా ఉంటుంది. స్వామి ఆరాధన చేస్తుంటే కుండలిని మేల్కొలిపి షడ్రచక్రాల ద్వారా చివరికి సహస్రారానికి చేరుకుంటుంది. అంటే షడ్రచక్రాల ద్వారా తనని తాను ఎక్స్‌ప్రెస్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. అందుకే తమిళనాడులో 6 షణ్ముఖ క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ సాధన చేస్తే కుండలిని జాగరణ చాలా తేలికగా జరుగుతుంది.