Diwali: దీపావళికి ముందు తప్పక చేయాల్సిన 3 పనులు
Diwali: దీపావళి వచ్చేస్తోంది. సాధారణంగా దీపావళి సమయంలో ఏం చేస్తారు అని ఎవర్నైనా అడిగితే.. ఏముంది.. కొత్త బట్టలు వేసుకుంటాం.. స్వీట్స్ తింటాం.. బాణసంచా కాలుస్తాం అనే చెప్తారు. ఇవన్నీ సరే. కానీ దీపావళి ముందు చేయాల్సిన ముఖ్యమైన మూడు పనులు ఉన్నాయి. అవేంటో .. ఎందుకు చేయాలో తెలుసుకుందాం.
పితృ దేవతా ప్రీతి
Diwali: నరక చతుర్దశి రోజున చేయాల్సిన పని.. పితృ దేవతా పూజ. అదేంటీ.. పితృ దేవతా పూజ మహాలయపక్షాల సమయంలో చేస్తాం కదా అనే సందేహం మీకు వస్తుంది. మహాలయ పక్షాలు ఎంత ముఖ్యమైనదో నరక చతుర్దశి, దీపావళి కూడా పితృ దేవతలకు అంత ముఖ్యమైనది. సామాన్యంగా ఎవరైనా నరక చతుర్దశి అనే పేరు ఎలా వచ్చింది అంటే నరకాసురుడి కథ చెప్పేస్తాం కదా. కానీ నరక చతుర్దశి అనేది నరకారుసురుడి కథ జరిగక ముందు ఉన్న పురాణాల్లో కూడా ఉంది. నరకం అనే పదానికి దుర్గతి అని అర్థం.
మన పితృ దేవతలు ఉంటారు కదా.. వాళ్లు మహాలయ పక్షం ప్రాంతంలో క్రవ్యాలు స్వీకరించడానికి కిందకి వస్తారు. వాళ్లని మళ్లీ సాగనంపే సమయమే నరక చతుర్దశి. అప్పుడు పితృ దేవతలకు వారిని వారి లోకాలకు దారి చూపించాలన్నమాట. ఇలా చేస్తే వాళ్లకి పితృ దేవతలకు మనం ఇంకా గౌరవిస్తున్నాం అని తెలుస్తుంది. ఆ విషయం వారికి తెలిస్తే వారి ఆశీస్సులు మనకు ఉంటాయి. వారి ఆశీస్సులు ఉంటే వంశానికి, పిల్లలకు, వాళ్ల పిల్లలకు ఏ విషయంలోనూ లోటు ఉండదు. పితృ దేవతల ఆశీర్వచనం ఉంటే ఆ కుటుంబం హాయిగా ఉంటుంది. అందుకోసం పితృ దేవతలను పూజించి వాళ్లకి ఆ ప్రక్రియను చేయాలి.
ఏం చేయాలి?
ఒక దివిటీకి మంట పెట్టి ఆకాశం వైపు చూపించి పితృ దేవతలను తలుచుకుని వారికి చూపించి నేలపై మూడు సార్లు కొట్టి కిందపడేయాలి. ఇలా చేస్తే ఒకవేళ మన పూర్వీకులకు కానీ ఉత్తమగతులు కలగకుండా ఉంటే వాళ్లకి సద్గతి కలిగి పైకి వెళ్లిపోతారు అని పెద్దలు చెప్తారు. అప్పుడు పితృ దేవత మండలం చాలా సంతోషిస్తుంది. కానీ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ దివిటీని మగవారు మాత్రమే వెలిగించాలి. ఆడవారు పక్కనే నిలబడి దండం పెట్టుకోవాలి.
అలక్ష్మీ ఉద్వాసన
అలక్ష్మీ ఎక్కడ ఉంటుందో తెలుసా? అపరిశుభ్రమైన దేహం, ఇంట్లో, చీకట్లో ఉంటుంది. మొట్టమొదట మన దేశం అపరిశుభ్రంగా ఉంటుంది కదా దానిని శుద్ధి చేసుకోవాలి. అదెలాగంటే.. దీపావళి రోజున ఉదయం సూర్యోదయానికి ముందే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి. అప్పుడు అలక్ష్మిని సాగనంపచ్చు. అలక్ష్మికి నువ్వుల నూనె స్నానానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? కొన్ని తిథుల్లో కొన్ని పదార్థాలు యాక్టివేట్ అవుతాయి. ఉదాహరణకు విజయదశమి రోజు జమ్మిచెట్టు యాక్టివేట్ అవుతుంది.
అదే విధంగా దీపావళి రోజు తెల్లవారుజామున నువ్వుల నూనెలో లక్ష్మీ దేవి శక్తి నీటిలో గంగాదేవి శక్తి యాక్టివేట్ అవుతాయి. సూర్యోదయానికి ముందు మాత్రమే. సూర్యుడు వచ్చాక కాదు. ఆ రెండింటినీ సమ్మేళితం చేయగలిగితే మన ఒంటికి పట్టిన అలక్ష్మి అంతా పోతుంది అని మన శాస్త్రంలో చెప్పారు. మన పెద్దలు ఏం చెప్పారంటే….
తైలే లక్ష్మీర్ జలే గంగా
దీపావళి తిధౌ వసేత్
అలక్ష్మి పరిహారార్ధం
తైలాభ్యంగో విధీయతే
ఇంటికి ఉన్న అలక్ష్మి ఎలా పోగొట్టాలంటే.. ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఎక్కడా బూజులు దుమ్ము ఉండకూడదు. మరీ ముఖ్యంగా దేవుడి గది. అన్నీ శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోండి. చీకట్లో అలక్ష్మి ఉంటుంది. అందుకే మన పూర్వీకులు సాయంత్రం అయ్యే సరికి ఇంకా దీపాలు పెట్టలేదేంటి అంటుంటారు. దానిని పోగొట్టడానికి ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది.
లక్ష్మీ పూజ
ఇక మూడోది లక్ష్మీ పూజ. అలక్ష్మిని పంపించేసాం కాబట్టి లక్ష్మీ దేవిని ఆహ్వానించాలి. లక్ష్మీ దేవి పూజకు కావాల్సిన సామాగ్రిని తెచ్చుకుని చక్కగా శోడశోపచార పూజ చేసుకుంటే ఎంతో మంచిది.