వందేభారత్ రైల్లో ప్రత్యేకతలు.. ఛార్జీలు ఇలా!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. ఈక్రమంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే సికింద్రబాద్ నుంచి ఆరు సూపర్ ఫాస్ట్ రైళ్లను నడుపుతుండగా.. దాదాపు ప్రయాణ సమయం 12 గంటలు పడుతోంది. దీంతో ఎక్కువ సమయం అవుతుండటంతోపాటు.. రైళ్లలో రద్దీ నెలకొంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు సన్నద్ధమైంది. అందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మధ్య నూతనంగా వందేభారత్ రైలును ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వందే భారత్ రైలు నడుపుతుండగా.. దీనికి స్పందన బాగా ఉంది. ఈనేపథ్యంలోనే రెండో రైలును కూడా తెలుగు రాష్ట్రాల మధ్య నడపాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ రైలు ప్రత్యేకతలు, సమయాలు, టికెట్టు ఛార్జీలు ఇలా ఉన్నాయి..
వందేభారత్ ప్రయాణికులకు ఎంతో సౌలభ్యం..
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ రైళ్లలో చేరుకోవాలంటే.. ప్రయాణ సమయం 12 గంటలు పైనే పడుతోంది. ఇక వందేభారత్ ట్రైన్ అయితే… సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కేవలం 8.30 గంటల్లో ప్రయాణికులను చేరవేయనుంది. దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాలకు మాత్రం రెండోది. ఇక ఈ రైల్లో 8 కోచ్ ఉంటాయి.. సుమారు 530 సీటింగ్ సామర్థ్యం ఉంది. ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్, ఏడు చైర్ కార్ కోచ్‌లు ఉన్నాయి. ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్‌లను పెంచే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ రైలు శనివారం ఉదయం 11.30 నుంచి 12.05 లోపు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నెల 9 నుంచి మాత్రం ఉదయం 6 గంటల నుంచి వందే భారత్ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. వందే భారత్ ట్రైన్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. రానున్న రోజుల్లో మరింత వేగం పెంచేలా చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. ఈ సెమీ హైస్పీడ్ రైలు సికింద్రాబాద్‌లో బయల్దేరి.. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఆగనుంది. మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు సేవలందిస్తుంది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే (20701) రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతి – సికింద్రాబాద్ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది.
టికెట్ల ధరల వివరాలు ఇలా..
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ ఛార్జీ 1680, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3080 రూపాయలుగా ఐఆర్టీసీ నిర్ణయించింది. ఇక తిరుపతి నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ఛార్జీ 1625, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3030 రూపాయలు మాత్రం స్వల్ప మార్పులు చేసింది. వారానికి 6 రోజులు మాత్రమే వందేభారత్ రైలు అందుబాటులో ఉంటుంది.
ఒక్కో స్టేషన్‌కు ఛార్జీలు ఇలా..
1. ఛైర్ కార్
సికింద్రాబాద్ నుంచి నల్గొండ – రూ.470
సికింద్రాబాద్ నుంచి గుంటూరు – రూ.865
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ.1075
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ.1270
సికింద్రాబాద్ నుంచి తిరుపతి – రూ.1680
2. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్….
సికింద్రాబాద్ నుంచి నల్గొండ – రూ.900
సికింద్రాబాద్ నుంచి గుంటూరు – రూ.1620
సికింద్రాబాద్ నుంచి ఒంగోలు – రూ.2045
సికింద్రాబాద్ నుంచి నెల్లూరు – రూ.2455,
► సికింద్రాబాద్ నుంచి తిరుపతి – రూ.3080