బాలుడిపై మైనర్ల లైంగిక దాడి
ప్రస్తుతం పిల్లలకు ఇంటర్నెట్, సెల్‌ఫోన్లు అందుబాటులోకి రావడం తల్లిదండ్రులకు తలనొప్పే కాదు.. తల వంపులను తెచ్చిపెడుతోంది. సెల్‌ఫోన్లలో పోర్న్ వీడియోలు చూడటం.. వాటిని అనుసరించి వయసు, జెండర్ తో పని లేకుండా తెలిసీ తెలియని వయసులో పిచ్చి చేష్టలకు మైనర్లు పాల్పడటం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో జరిగిన సంఘటన సరిగ్గా ఇదే విధంగా ఉంది. ఓ బాలుడిపై ఇద్దరు మైనర్ అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఓ కాలనీకి చెందిన బాలుడి(10)పై అదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనికి ముందు పదేళ్ల బాలుడిని గుంటూరు తీసుకెళ్తామని ఆ ఇద్దరు మైనర్లు నమ్మించారు. దీంతో నమ్మిన బాలుడు వారితోపాటు ఓ బాలుడి ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో పదేళ్ల బాలుడిపై అసహజ శృంగారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వారు చేస్తున్న చర్యను సెల్‌ఫోన్‌తో వీడియో చిత్రీకరించారు. అనంతరం ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో మౌనంగా ఉన్న బాధిత బాలుడు.. సదరు మైనర్లు వీడియోను సోషల్‌మీడియాలో పెట్టారు. దీంతో బాధితుని తండ్రి పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ఇద్దరు మైనర్లను జువైనల్ హోంకు తరలించారు.
తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం..
తల్లిదండ్రులు వారి వారి దినచర్యలో భాగంగా పనులకు వెళ్లిపోవడంతో ఇళ్ల వద్ద పిల్లలను పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో చిన్నారులపై లైంగిక దాడులు ఇటీవల కాలంలో అధికమయ్యాయి. దీనికి తోడు.. సెల్‌ఫోన్లను మైనర్లకు అప్పగించడం కూడా కొంపముంచుతోంది. వరుస ఘటనల నేపథ్యంలో ఇప్పటికైనా తల్లిదండ్రులు మేల్కొవాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. పిల్లలపై వారి కదలికలపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలని కన్నవాళ్లకు సూచిస్తున్నారు.