గుండెపోటుతో వైద్య విద్యార్థిని మృతి!

కారణాలేవైనా గుండెపోటుతో మృతి చెందే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా విద్యార్థులు సైతం మృత్యవాత పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి గుండెపోటుతో మరణించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన పూజితారెడ్డి ఇక్కడే ఒక ప్రయివేటు వైద్య కళాశాలలో బీడీఎస్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం కెనాడా వెళ్లారు. అయితే కెనడాలో హాస్టల్ లో ఉంటూ గుండెపోటుకు గురై మరణించింది. ఖమ్మం జిల్లా మల్కాపూర్ కు చెందిన వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె. కుమార్తె పూజితారెడ్డి ఖమ్మంలోనే ఒక ప్రయివేటు కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువులు చదివేందుకు ఈ ఏడాది జనవరి 26వ తేదీన కెనడా వెళ్లారు. ఆమె సోదరుడు అరుణ్ రెడ్డి కూడా కెనడాలోనే ఉంటున్నారు. కొద్ది రోజులు తన సోదరుడి ఇంట్లో ఉండి, ఆ తర్వాత యూనివర్సిటీ హాస్టల్ లో చేరారు. పది రోజుల కిందట గుండెపోటుకు గురై హాస్టల్ గదిలో కుప్పకూలారు. స్నేహితులు, యాజమాన్యం ఆమెను వెంటనే హాస్పిటల్ తరలించింది. చికిత్స పొందుతూ కన్నుమూశారు. సోదరుడు ఆమె మృతదేహాన్ని స్వస్థలమైన మల్కాపూర్ (ఏ)కు తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి డాక్టరై వస్తుందనుకుంటే విగతజీవిగా తిరిగొచ్చిన కూతురిని చూసుకుని గుండెలవిసేలా విలపించారు ఆమె తల్లిదండ్రులు. స్వస్థలంలో సోమవారం అంతక్రియలు నిర్వహించారు.