ఎల్బీనగర్‌ కూడలికి శ్రీకాంతాచారి పేరు పెడతాం – మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ కూడలిలో మరో ఫ్లైఓవర్‌ ను మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. దీన్ని సుమారు రూ.32 కోట్లతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ పూర్తి కావడంతో.. హయత్‌నగర్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలు సులువుగా వెళ్లే అవకాశం ఏర్పడింది. గతంలో ఒక ఫ్లైఓవర్‌ను ప్రారంభించగా.. తాజాగా రెండో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో.. ఎల్బీనగర్‌ కూడలి సిగ్నల్‌ ఫ్రీగా మారిందని కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన 35వ ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. మరో 12 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోనే 12 పనులు చేపట్టామని.. ఇప్పటికే 9 ప్రాజెక్టులు పూర్తికాగా.. మిగతా 3 ఫ్లై ఓవర్లను సెప్టెంబరులోపు పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. నాగోల్‌ మెట్రోను దిల్‌సుఖ్‌నగర్‌ లైన్‌తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత మెట్రోను హయత్‌నగర్‌ వరకు విస్తరిస్తామన్నారు. ఎల్బీనగర్‌ మెట్రో మార్గాన్ని విమానాశ్రయంతో అనుసంధానిస్తాం. ఏడాదిన్నరలోపే కొత్తపేట మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎల్బీనగర్‌ కూడలికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని కేటీఆర్‌ చెప్పారు.