నేటి నుంచి మెట్రో రైళ్లలో బాదుడే బాదుడు

హైదరాబాద్‌ మెట్రో రైలుకు తొలి నుంచే అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రజలు మెట్రో ప్రయాణాన్ని కూడా చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోరైళ్లను నడుపుతున్న ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రయాణికులకు బిగ్‌ షాకిచ్చింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి.. మెట్రో రైలు టికెట్ల కొనుగోలుకు ఉపయోగించే కార్డు, క్యూ ఆర్ కోడ్ ద్వారా పొందుతున్న రాయితీపై కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇది వరకు ఎప్పుడు ప్రయాణించినా 10 శాతం రాయితీ ఇచ్చేవారు. కాగా.. ప్రస్తుతం దానికి భిన్నంగా కొన్ని ఈ సమయం నుంచి ఈ సమయంలో ప్రయాణించేవారికే రాయితీ వస్తుందని తేల్చి చెప్పింది. దీంతో ప్రయాణికులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా రోజూ మెట్రో రైళ్లను వినియోగించుకునే ఉద్యోగులు, ప్రజలపై అదనపు భారం పడనుంది. దీంతోపాటు సెలవు రోజుల్లో ఇచ్చే సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీలను కూడా పెంచేసింది. గతంలో రూ.59 ఉండగా.. ప్రస్తుతం దీని ధర రూ.99కి పెంచింది. ఇప్పటికే పాత కార్డు ఉన్న వారు కూడా 99 రూపాయలు రీచార్జ్‌ చేసుకోవాలని సూచించింది.

 

ఆ ఆరుగంటలే రాయితీ వర్తిస్తుంది..

హైదరాబాద్‌ మెట్రో రైల్లో ఇకపై ప్రయాణించేవారికి రోజులో కేవలం 6 గంటలు మాత్రమే పది శాతం రాయితీ వర్తిస్తుందని ఎల్‌అండ్‌ టీ సంస్థ పేర్కొంది. అది కూడా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే 10 శాతం రాయితీ ఉంటుందని ప్రయాణికులకు షాక్‌ ఇచ్చింది. గతంలో అయితే.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాయితీ ఇచ్చేవారు. ఇప్పడు దాన్ని తొలిగించారు. ఈ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. అదేవిధంగా సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీని కూడా భారీగా పెంచారు. సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు రూ.59గా ఇప్పటి వరకు ఉంది.. ఇది ఏప్రిల్‌ 1 నుంచి రూ.99కి పెంచనున్నారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు అమల్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గతంలో సెలవు రోజుల్లో హాలిడే కార్డుని వాడుకునేవారు. కానీ ప్రస్తుతం ఎల్‌అండీటీ సుమారు 100 రోజుల హాలిడే లిస్టును తయారు చేసింది. అంటే ఆ రోజుల్లో మాత్రమే కార్డు పనిచేస్తుందని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైల్లలో రోజూ సుమారు 4.4 లక్షల మంది ప్రయాణిస్తున్నారని.. మొత్తం మూడు కారిడార్లలో 57 స్టేషన్లు ఉండగా.. 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు కొనసాగుతున్నాయన్నారు. ప్రజల సౌకర్యార్థం మెట్రో సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు సంస్థ కృషి చేస్తోందన్నారు. ఇక ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 10 శాతం రాయితీ కొన్ని సమయాల్లోనే వర్తిస్తుందని, అదేవిధంగా హాలిడే కార్డు ధరలను కూడా మర్చినట్లు ఆయన పేర్కొన్నారు.