2 గంట‌ల్లో విజయవాడ టూ షిర్డీ

ఇండిగో ఎయిర్‌లైన్స్ షిర్డీ వెళ్లే సాయిబాబా భక్తులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని వాసులకు ఇది నిజంగానే గుడ్‌ న్యూస్‌ అన్న మాట. విషయం ఏంటంటే.. విజయవాడ టు షిర్డీ అంటే చాలా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి రైల్లో వెళ్లాలంటే.. సుమారు 20 గంటలు పడుతుంది. లేదంటే.. హైదరాబాద్ వెళ్లి.. అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. ఈ ఇబ్బందులన్నింటికీ చెక్‌ పెట్టేలా.. విజయవాడ నుంచి షిర్డీకి నేరుగా వెళ్లేలా ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 26వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.

వారం మొత్తం సర్వీసులు ఉంటాయి..
మార్చి 26వ తేదీన మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణికులతో మొదటి ఫ్లైట్ విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి షిర్డీ వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.35 గంటలకు 66 మంది ప్రయాణికులతో షిర్డీ నుంచి విజయవాడకు వచ్చింది. తొలి రోజే ఈ విమాన సర్వీసుకు మంచి ఆదరణ లభించిందని.. ప్రయాణీకులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోరారు. ఏటీఆర్ 72-600 విమానం ప్రతీ రోజూ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీ వెళ్తుందని.. ఈ సర్వీసులు వారం అంతటా అందుబాటులో ఉంటాయని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అధికారులు చెబుతున్నారు. ఇకపై 20 గంటలు ప్రయాణించాల్సిన పనిలేదు. కేవలం రెండు గంటల్లో షిర్డీకి వెళ్లవచ్చని వారు అంటున్నారు. ఇది నిజంగా భక్తులకు శుభవార్తే కదా.