శ్రీవారి స‌న్నిధిలో గంజాయి క‌ల‌క‌లం

కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. ఈనేపథ్యంలో తిరుమల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ కొన్నేళ్ల కిందటే మద్యం, మాంసం, సిగరెట్‌, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నిషేధించింది. వాటితో తిరుమలకు రానీయకుండా అలిపిరిలోనే తనిఖీ చేసేలా టోల్‌ గేట్‌ను కూడా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్నిరకాల తనిఖీలు చేపడుతున్నప్పటికీ నిషేధిత ఉత్పత్తులు తరచూ కొండపై కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ నెల 24న వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని లగేజీ కౌంటర్‌లో పనిచేసే ఒప్పంద ఉద్యోగి నుంచి 150 గ్రాముల గంజాయి ప్యాకెట్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 24న తిరుమల జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద ఓ కూరగాయల వాహనంలో 200 గ్రాముల గంజాయిని ఎస్‌ఈబీ, విజిలెన్స్‌ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఆ వాహనాన్ని సీజ్‌ చేయడంతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఇలా తిరుమలకు గంజాయిని తరలిస్తున్న ఘటనలు ఆందోళనలను కలిగిస్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తరచూ గంజాయి పట్టుబడుతుండటం టీటీడీని కలవరపెడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కొండకు వచ్చే భవన నిర్మాణ కార్మికులు, పారిశుధ్య పనులు చేసే కూలీలు కొద్దిరోజులుగా గంజాయి మత్తులో ఉండటం.. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లడంతోపాటు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది వచ్చేచోట ఇలాంటి ఘటనలు ఇబ్బంది కరంగా మారాయి.

భద్రతా వైఫల్యమే కారణమా..
ఎస్పీఎఫ్‌, విజిలెన్స్‌ విభాగాలు అలిపిరి తనిఖీ కేంద్రంలో తనిఖీలు చేస్తున్నప్పటికీ గంజాయి తిరుమలకు ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్య వైఖరితోనే తిరుమల పవిత్రతకు ఆటంకం కలగడంతోపాటు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ టీటీడీ, ప్రభుత్వంపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో ఏం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద భద్రతా సిబ్బంది తనిఖీ లోపం కారణంగా ఇటు టీటీడీతో పాటు ప్రభుత్వం కూడా విమర్శల పాలవుతోంది. తిరుమలకు మూడంచెల భద్రత కల్పించామని టీటీడీ చెబుతున్నా.. గంజాయి తిరుమలకు వస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని పలువురు మండిపడుతున్నారు. కొందరు అధికారులు మామూళ్లకు అటవాటు పడి.. తెలిసి కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

తిరుమల లక్ష్యంగా వరుస ఘటనలు..
ఎంతో పవిత్రతో కూడుకున్న తిరుమల ఆలయంలో కొన్నాళ్ల నుంచి భక్తుల మనోభావాలు, ఆలయ భద్రతకు ఇబ్బంది కలిగేలా కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తిరుమల ఆలయం పరిసర ప్రాంతాల్లో విమానాల రాకపోకలపై నిషేధం ఉండగా.. కొన్ని నెలల కిందట డ్రోన్‌తో ఆలయ పరిసర ప్రాంతాలను షూట్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ఈక్రమంలో డ్రోన్‌తో వీడియో తీస్తున్నక్రమంలో ఆలయ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అంటూ భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. దీని తర్వాత సీఎంవో స్టిక్కర్‌ ఉన్న ప్రభుత్వ వాహనం నేరుగా తిరుమల ఆలయ పరిసర ప్రాంతాల్లోకి రావడం కలకలం రేపింది. భద్రతా సిబ్బంది కూడా పట్టించుకోకపోవడం శోచనీయంగా మారింది. వీటిపై టీటీడీ ఎవరిపై చర్యలు తీసుకోలేదు. ఇక ప్రస్తుతం గంజాయి తిరుమల పైకి తరలిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుమలలో నిఘా వ్యవస్థ, భద్రతను కట్టుదిట్టం చేయాలని వారు కోరుతున్నారు.