డిజిటల్‌ విధానంలో పది పరీక్షలు..ఏపీలోనే తొలిసారి!

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో ఓ ప్రత్యేకత సంతరించుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఆరుగురు అంధత్వం ఉన్న విద్యార్థులు ఈ సారి డిజిటల్‌ విధానంలో పరీక్షలు రాయనున్నారు. సాధారణంగా అంధత్వం, ఇతర దివ్యాంగులు వ్యక్తిగత సహాయకుల(స్క్రైబ్‌)ను పెట్టుకుని ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయించుకుంటుంటారు. అయితే.. ఓ ఆరుగురు అమ్మాయి మాత్రం తాము డిజిటల్‌ విధానంలో పరీక్షలు రాస్తామని.. అందుకోసం గత కొంతకాలంగా ఈ విధానంపై శిక్షణ తీసుకున్నారు. అసలు వీరికి పరీక్షలు ఏవిధంగా నిర్వహిస్తారు.. వారు ఏవిధంగా రాయనున్నారు.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా..

దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రయోగం…
అనంతపురం జిల్లాలోని ఆర్‌డిటి (రూరల్ డెవలెప్మెంట్ ట్రస్ట్) ఇన్‌క్లూజివ్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థినులు ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలను డిజిటల్‌ విధానంలో రాయనున్నారు. వారి పేర్లు.. ఎక్కలూరు దివ్యశ్రీ, పొలిమెర చైత్రిక, ఏకుల సౌమ్య, మేఖ శ్రీధాత్రి, ఉప్పర నాగరత్నమ్మ, చంచుగారి పావని. వీరంతా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న పరీక్ష కేంద్రంలో టెన్త్‌ ఎగ్జామ్స్‌ రాయనున్నారు. అయితే వీరందరూ దివ్యాంగులు (దృష్టి లోపం ఉన్నవారు) .. కానీ సహాయకులు అవసరం లేకుండానే తామే పరీక్షలు రాస్తామని చెబుతున్నారు. ఇలా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా పదో తరగతి రాష్ట్ర బోర్డ్ పబ్లిక్ పరీక్షలకు దివ్యాంగ (దృష్టి లోపం ఉన్న) విద్యార్థులు డిజిటల్ విధానంలో పరీక్షలు రాసేందుకు హాజరవుతున్నారు. ఈ విద్యార్థులు ల్యాప్ టాప్ లను ఉపయోగించి స్వయంగా గణితం, సైన్స్, తెలుగు వంటి కఠినమైన సబ్జెక్టులతో సహా అన్ని సబ్జెక్టులను తమంతట తామే డిజిటల్‌గా రాయడానికి సమాయత్తం అవుతున్నారు. హిందీ పరీక్ష వీరికి ఉండదు. అందుకు అనుగుణంగా ఎస్సెస్సీ బోర్డు సంచాలకులు డిజిటల్‌గా ప్రశ్నపత్రాలను రూపొందించి విద్యార్థులకు ఇవ్వనున్నారు. భారతదేశంలోని ఇప్పటివరకు ఏ పోటీ పరీక్షలు, బోర్డు పరీక్షలు, UPSC పరీక్షల్లో గానీ దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం (డిజిటల్ విధానం) ద్వారా రాసే సౌలభ్యం కల్పించలేదు. తొలిసారిగా ఏపీలో ఈ విధానం తీసుకొచ్చారు. పరీక్షల్లో డిజిటల్‌గా యాక్సెస్ చేసి ప్రశ్న పత్రాలను విద్యార్థులకు ఇవ్వడం ఇదే మొదటిసారి. తొలుత ఆ విద్యార్థినులకు ప్రింటెడ్‌ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్‌ను పరీక్షా కేంద్రంలోని ఎగ్జామినేషన్ అథారిటీ సిబ్బంది ప్రశ్నాపత్రాన్ని డిజిటల్ రూపంలో మారుస్తారు. తర్వాత ఈ ప్రశ్నాపత్రాన్ని విద్యార్థుల కంప్యూటర్లలో లోడ్ చేస్తారు. ఈ విద్యార్థులు ఎన్.వి.డి.ఏ (నాన్ విజబుల్ డెస్క్ టాప్ యాక్సెస్) సాప్ట్ వేర్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులు వింటారు. ఇదివరకే ఈ విద్యార్థులకు టైపింగ్ నేర్చుకోవడం వల్ల జవాబులు వారే టైపింగ్‌ చేస్తారు. అయితే.. ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ పరీక్షల్లో ఇంటర్నెట్ సదుపాయం విద్యార్థులకు కల్పించట్లేదు.

వీరికి పరీక్ష సమయం ఇలా..
పదో తరగతి పరీక్ష పత్రాన్ని డిజిటల్‌ రూపంలోకి మార్చడానికి కొంత సమయం పడుతుంది కనుక.. వీరికి కొంత వెసులు బాటు ఇచ్చారు. 15 నిమిషాల ఆలస్యం అవుతుండటంతో.. దీన్ని ఈ విద్యార్థులకు చివరి 15 నిమిషాలు అదనంగా ఇవ్వనున్నారు. గతంలో అన్ని పబ్లిక్ పరీక్షల్లో దృష్టి లోపం ఉన్న విద్యార్థి వినడానికి, ప్రశ్నను చదవడానికి, పరీక్షలు రాయడానికి ఒక సహాయకుడిని ప్రభుత్వమే నియమించేది. అయితే ఆ సౌలభ్యం కూడా ఏ ఏడాది ఉంది. కానీ ఆ ఆరుగురు విద్యార్థులు ముందుగానే శిక్షణ పొందారు కనుక.. డిజిటల్‌ విధానంలో పరీక్షలు ఈ సారి రాయనున్నారు.

ఈ డిజిటల్ విధానం ద్వారా విద్యార్థినులు స్వయంగా పరీక్షలు రాయడం వల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. భవిష్యత్తులో సాంకేతిక రంగంలో నిలబడి ఉన్నతశిఖరాలు అధిరోహించడానికి తొలిమెట్టుగా ఇది నిలుస్తుందని అంటోంది. భారతదేశంలో దృష్టి లోపం ఉన్నవారిలో ప్రస్తుత నిరుద్యోగ రేటు 99%. అయితే ఈ వినూత్న ప్రయోగం వల్ల దృష్టి లోపం విద్యార్థులే కాకుండా, ఇతర దివ్యాంగ విద్యార్థులకు కూడా 100% ఉపాధి పొందడానికి ఒక మార్గం సుగమం అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ తదితరులు చెబుతున్నారు.