13 ఏళ్లుగా.. భార్యను బయటికి రానివ్వని సైకో
ఓ సైకో భర్త కారణంగా.. ఓ మహిళ 13 ఏళ్లు నరకం అనుభవించింది. తన తల్లిదండ్రులను, బయటికి వారెవ్వరినీ కలుసుకోనివ్వకపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. గత నెల 27న స్పందన అనే కార్యక్రమం ద్వారా ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు విముక్తి కలిపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. విజయనగరం నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన మధుబాబు అనే వ్యక్తి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన జనార్ధన్, హేమలత దంపతుల కుమార్తె సాయిసుప్రియను 2008లో మధుబాబుకి ఇచ్చి వివాహం జరిపించారు.
2009లో సుప్రియ డెలివరీకి పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత పాప పుట్టడంతో తన భర్త దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ మధుబాబు సైకోలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తన కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా కనీసం ఫోనులో కూడా మాట్లాడించకుండా ఇంట్లోనే బంధించేసాడు. ఆ తర్వాత ఇద్దరు మగపిల్లలు పుట్టినా కూడా ఆ విషయాన్ని సుప్రియ తల్లి దండ్రులకు తెలియనివ్వలేదు. తమ కూతురి నుంచి ఎలా ఫోన్ కాల్ రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు సుప్రియ ఇంటికి వెళ్లినా.. మధుబాబు ఇంట్లోకి రానివ్వకుండా పంపించేసేవాడు. దాంతో తమ కూతురు ఎలా ఉందోనన్న బెంగతో సుప్రియ తండ్రి మంచానపడ్డారు. అయితే ఫిబ్రవరి 27న సుప్రియ తల్లిదండ్రులు స్పందన అనే కార్యక్రమం ద్వారా ఎస్పీ దీపికతో మాట్లాడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాగైనా సుప్రియను బయటికి తీసుకొచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని పోలీసులను మధుబాబు ఇంటికి పంపించారు.
మధుబాబు న్యాయవాది కావడంతో వారెంట్ లేకుండా తన ఇంటికి ఎలా వస్తారని వారించి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దాంతో వెంటనే విజయనగరం పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సెర్చ్ వారెంట్‌ను తెచ్చుకున్నారు. అప్పుడు కూడా మధుబాబు వారిని ఇంట్లోకి రానివ్వకుండా, భార్య సుప్రియను బయటికి పంపించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు సుప్రియను బలవంతంగా బయటికి తీసుకొచ్చి న్యాయస్థాన ఎదుట హాజరుపరిచారు. సుప్రియను తల్లిదండ్రులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఉన్నత చదువులు చదువుకున్న మధుబాబు ఇలా ఎందుకు సైకోగా ప్రవర్తిస్తున్నాడు అన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.