యూట్యూబ్ చూసి డెలివరీ చేసుకున్న 15 ఏళ్ల బాలిక.. బిడ్డనూ చంపేసింది!
సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకుని ఎంతో మంది మైనర్లు, యువత బానిసలుగా మారుతున్నారు. ప్రధానంగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ వంటి మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. తెలిసీ తెలయని వయసులో ఏవో తప్పులు చేయడం వాటి నుంచి బయటపడేందుకు సామాజిక మాధ్యమాలను ఆశ్రయించి.. మరింత ఇబ్బందులను కొని తెచ్చుకోవడం ఈ మధ్య ఎక్కువైపోయింది. ఇక ఇదే క్రమంలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ బాలిక గర్బవతి కాగా.. గుట్టుచప్పుడు కాకుండా తానే స్వయంగా డెలివరీ చేసుకోవాలని భావించి అందుకు యూట్యూబ్‌ను ఆశ్రయించింది. అలా కొన్ని వీడియోలు చూసి డెలివరీ చేసుకున్న అనంతరం పుట్టిన బిడ్డను చంపేసి.. బాక్సులో పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అసలు బాలిక ఎలా గర్భవతి అయ్యింది.. ఎందుకు బిడ్డను చంపేసింది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తితో..
నాగ్‌పూర్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ఉంది. అందులో గత కొంతకాలం కిందట.. ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో అతను ఆ బాలికకు మేసేంజర్, వాయిస్ కాల్స్‌లో నిత్యం మాట్లాడుతుండేవాడు. కొన్ని నెలల క్రితం బాలికకు మాయమాటలు చెప్పి తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా ఆమెకు మద్యం తాగించి.. అనంతరం అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. కొన్ని నెలలు తర్వాత పొట్ట లావైపోతుండటంతో ఏమైందని బాలికను తల్లి ప్రశ్నించింది. తనకు కొంతకాలంగా పీరియడ్స్ రావడం లేదని అందుకే పొట్ట అలా ఉందని కుమార్తె నమ్మబలికింది. చివరకు 9 నెలలు సమీపిస్తుండటంతో తాను గర్భం దాల్చిన విషయం చుట్టపక్కల వారికి, ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భావించిన బాలిక.. యూట్యూబ్‌లో కాన్పుకు సంబంధించిన పలు వీడియోలు చూసి తనకు తానే డెలివరీ చేసుకుంది.
ఇంట్లో రక్తపు మరకలు చూసి తల్లి షాక్..
యూట్యూబ్ ద్వారా డెలివరీ చేసుకున్న బాలిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ ప్రాణం విలువ, తల్లి ప్రేమ ఎరుగని ఆ మైనర్ బాలిక.. ఆ పసికందు గొంతు నులిమి చంపేసింది. ఆ బిడ్డను ఇంట్లోని ఓ బాక్సులో దాచిపెట్టింది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన బాలిక తల్లి… కూతుర్ని చూసి షాక్ కు గురైంది. ఇంట్లో ఉన్న రక్తపు మరకలను చూసి ఏం జరిగిందని బిడ్డను ఆమె నిలదీసింది. దీంతో చేసేందేం లేక జరిగిన విషయం తల్లికి చెప్పేసింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు కారణమైన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.